Kiran Abbavaram Engagement: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం- నటి రహస్య గోరక్ నిశ్చితార్థ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో కిరణ్- రహస్య ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ యంగ్ కపుల్‌కు నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆగస్టులో మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటికానున్నట్లు తెలుస్తోంది. పెళ్లి గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది.
ఇక ఈ జంట 'రాజావారు రాణిగారు' సినిమాతోనే తెరంగేట్రం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. దీంతో గతంలో వీరిద్దరూ లవ్‌లో ఉన్నరంటూ పలుమార్లు వార్తలు వైరలయ్యాయి. వీటిపైన స్పందించిన కిరణ్ అలాంటిదేమీ లేదని, రహస్యతో ఉన్నది స్నేహం మాత్రమేనని ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. కానీ, రహస్యతో లవ్‌ట్రాక్ నడిపిస్తున్న మ్యాటర్ చెప్పి రీసెంట్గా కిరణ్ ట్విస్ట్ ఇచ్చారు.
కడప జిల్లా రాయచోటిలో జన్మించిన కిరణ్ లఘు చిత్రాలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో వచ్చిన 'రాజా వారు రాణిగారు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై 'ఎస్సార్ కళ్యాణమండపం', 'సమ్మతమే', 'వినరో భాగ్యము విష్ణుకథ', 'మీటర్', 'రూల్స్ రంజన్' చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన తొలి చిత్రంలో నటించిన కథానాయిక రహస్య జీవిత భాగస్వామిగా దొరకడం పట్ల కిరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రహస్య తమిళ చిత్రం 'షర్బత్'లో నటించారు.