Mutton Paya Soup Recipe : చలికాలంలో చాలా మంది వెచ్చదనం కోసం సూప్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. అయితే, వెచ్చదనాన్ని పంచే ఈ సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు మీకోసం అలాంటిదే ఒక సూప్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, "హైదరాబాదీ స్పెషల్ మటన్ పాయ సూప్". ఎవరైనా ఈజీగా చేసుకునే ఈ సూప్ చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు! మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ సూప్‌కి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మేక కాళ్లు - 2
- ఆయిల్ - 3 టేబుల్‌స్పూన్లు
- యాలకులు - 2
- లవంగాలు - 3
- దాల్చిన చెక్క - అంగుళం ముక్క
- మిరియాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 7
- సన్నని అల్లం తరుగు - 1 టీస్పూన్
- ఉల్లిపాయ - 1(మీడియం సైజ్ది)
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- బిర్యానీ ఆకు - 1
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చిన్న పుదీనా కట్టలు - 2
- పచ్చిమిర్చి - 6
- బాదం పేస్ట్ - 2 టీస్పూన్లు
మీకు సూప్స్ అంటే ఇష్టమా ? - ఓసారి "చికెన్ షోర్బా" ట్రై చేయండి - టేస్ట్ అద్భుతంగా ఉంటుంది!!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కాల్చిన మేక కాళ్ల ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నని చీలికలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, సన్నని అల్లం తరుగు వేసి కాసేపు వేయించుకోవాలి.
- అవి వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే ధనియాలను యాడ్ చేసుకొని వేపుకోవాలి.
- ఆనియన్స్ రంగు మారి చక్కగా వేగాయనుకున్నాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మేక కాళ్ల ముక్కలను వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మరో 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి.
రెస్టారెంట్ స్టైల్ "చికెన్ కార్న్ సూప్" - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!
- మేక కాళ్లను నిదానంగా, ఎంత బాగా వేయించుకుంటే సూప్ అంత రుచికరంగా వస్తుంది. లేదంటే నీచు వాసన వస్తుందని గుర్తుంచుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక ఉప్పు, పసుపు వేసి కలిపి మరికాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపాలి. అలాగే శుభ్రంగా కడిగిన పుదీనాను వేళ్లతో సహా వేసుకొని మూతపెట్టి సిమ్‌లో 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్నప్పుడే ఎముకల్లోని సారమంతా సూపలోకి దిగుతుంది. ఇందుకోసం కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టొచ్చు.
- ఆవిధంగా ఉడికించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూతతీసి కలపాలి. ఆ తర్వాత మళ్లీ స్టౌ ఆన్ చేయాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి పేస్ట్, బాదం పేస్ట్ వేసి కలిపి మరో 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వాలి.
- అలా ఉడికించుకున్నాక దింపేసి మరో గిన్నెలోకి జల్లెడ సహాయంతో సూప్‌ని వడకట్టుకోవాలి.
- అనంతరం సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో మెత్తగా ఉడికిన మేక కాళ్లు వేసుకొని దాని మీద మంచి ఫ్లేవర్స్‌తో నిండిన వడకట్టుకున్న సూప్ పోసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే హైదరాబాదీ స్పెషల్ "మటన్ పాయ సూప్" రెడీ!