Unauthorized Use Of Electricity In Serilingampally : మూడు పడక గదుల(ట్రిపుల్ బెడ్రూం) ఇంటికి నెలకు రూ.72 వ్యాపార సముదాయానికి రూ.200 కరెంట్ బిల్లు. అన్ని అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలుండే ప్రాంతంలో ఇంత తక్కువ బిల్లు వస్తుందంటే ఎవరికైనా సందేహం కలగవచ్చు. శేరిలింగంపల్లి తారానగర్ సెక్షన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులకు అనుమానం రాలేదు. నివాసితులు విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో వారి పరిశీలనలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మూడు పడక గదుల ఇంటికి రూ.72 కరెంట్ బిల్ : లింగంపల్లి, హుడా ట్రేడ్ సెంటర్‌లోని గాంధీ ఎస్టేట్ డీ బ్లాక్‌లో తరచూ విద్యుత్తు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై వారు కారణాలను అన్వేషించగా కొందరు అక్రమంగా విద్యుత్తు వాడుతున్నట్లు గుర్తించారు. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో 2 రోజుల క్రితం వారు దాడులు నిర్వహించారు. వారి పరిశీలనలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. నెలలుగా ఓ మూడు పడక గదుల ఇంటికి అతి తక్కువ కరెంట్ బిల్లు, కొన్నిసార్లు రూ.72 మాత్రమే వచ్చినట్లుగా తేలింది.
వేల యూనిట్లు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు నిర్ధారణ : రెండు మీటర్లున్న వ్యాపార సముదాయానికి ఒకటి పనిచేయకుండా చేసి, మరో దానిపై కేవలం రూ.200 కుదిరితే మరింత తక్కువగా బిల్లు కొన్నేళ్లుగా చెల్లిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. ఇలా కొన్ని వేల యూనిట్లు విద్యుత్తు చౌర్యానికి పాల్పడినట్లు అధికారులకు నిర్ధారణ అయింది. దీనిపై తారానగర్ ఏఈ సుమన్‌ను ప్రశ్నించగా విజిలెన్స్ అధికారుల దాడుల్లో విద్యుత్తు చౌర్యానికి పాల్పడినట్లు తేలిందని వివరించారు. ఆ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇంత తక్కువ బిల్లులు వస్తున్న విషయం మీరు ఎందుకు గుర్తించలేదని ఆయన్ను ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.
ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం అంటే - యూనిట్ ఉత్పత్తి చేసినట్లే
తెలంగాణవాసులకు గొప్ప శుభవార్త - విద్యుత్ ఛార్జీల పెంపు లేదు