Kangana Ranaut On Mahakumbh Viral Girl :ఉత్తర్ప్రదేశ్లోప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మోనాలిసా అనే యువతి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకోవడమే కాకుండా ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసి తనను ఇంకా పాపులర్ చేశారు. దీంతో ఏ నోట విన్నా ఆమె పేరే వినిపిస్తోంది. తాజాగా ఈమె సినిమాల్లోకి రానున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైరల్ గర్ల్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమెలాంటి హీరోయిన్‌లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, ఫొటోలు, వీడియోల కోసం మోనాలిసాను ఇబ్బందిపెట్టిన తీరు తనకు బాధ కలిగించిందన్నారు.
"ఇంటర్నెట్‌లో సెస్సేషన్‌గా మారిన మోనాలిసాతో ఫొటోలు దిగేందుకు కొందరు ప్రవర్తించిన తీరు నన్ను ఎంతగానో బాధించింది. వారిని ద్వేషించడం తప్ప నేను ఏం చేయగలను. ఇండస్ట్రీలో తనలాంటి రంగులో ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిని మీరు ఇలానే అభిమానిస్తున్నారా? కాజోల్, దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లపై చూపిన ప్రేమాభిమానాలే కొత్తవారిపైనా చూపిస్తున్నారా? మోనాలిసాను గుర్తించినట్లే తనలా ఉన్న కొత్తవారిని ఎందుకు గుర్తించరు?" అని కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.
ఇక కంగనా రనౌత్ తాజాగా 'ఎమర్జెన్సీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఎన్నో కాంట్రవర్సీల నడుమ ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. దీని తర్వాత ఆమె మరో కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మాధవన్‌తో కలిసి ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించనున్నారు. తాజాగా ఈ సినిమా షూట్ ప్రారంభమైంది. ఇదే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో 'తను వెడ్స్ మను 3' కూడా రానుంది.