Nag Ashwin Inspiration:ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'నాగ్ అశ్విన్'. ప్రభాస్ లీడ్ రోల్లో అశ్విన్ హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా జూన్ 27న రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. హై క్వాలిటీ వీఎఫ్ ఎక్స్, సీజీ వర్క్స్‌తో వండర్స్ క్రియేట్ చేశారు. ఫలితంగా కెరీర్లో తీసిన మూడో సినిమాతోనే అశ్విన్ రూ.1000కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన స్ఫూర్తి, సక్సెస్ మంత్ర ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
'చాలామంది తమ జీవితంలో ఎవరినో ఒకరిని స్ఫూర్తిగా తీసుకుంటారు. తాము చేసే పనుల్లోనూ ఎవరిదో ఒకరి ప్రభావం ఉంటుంది. అయితే నా విషయంలో అది పూర్తి భిన్నం. నాకు స్ఫూర్తినిచ్చింది వ్యక్తులు కాదు. నాకు ఎంతో ఇష్టమైన 'మాయాబజార్', 'భైరవ ద్వీపం', 'పాతాళభైరవి', 'స్టార్ వార్స్', 'మార్వెల్ సిరీస్' సినిమాలు. ఇవి ప్రేక్షకులను ఇంకో లోకంలోకి తీసుకువెళ్తాయి. అలాగే ఈ స్టోరీలు విన్నా, మన కళ్ల ఎదుట మరో ప్రపంచం కనిపిస్తుంది. ఈ సినిమాలు నా జీవితంలో నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను కూడా అలాంటి సినిమాలు తీయాలనే స్ఫూర్తిని నింపాయి. ఒక విధంగా 'కల్కి' ఆలోచన కూడ అక్కడ్నుంచి వచ్చిందే. స్టోరీతోపాటు సినిమాలో కొత్త కొత్త ప్రాంతాల ఆలోచనకు ఈ చిత్రాలే ఒక రకమైన కారణం.