Niloufer Baby kidnapping Case : నిలోఫర్‌లో కిడ్నాపైన శిశువును నాంపల్లి పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి ఏపీలోని కర్నూల్లో అరెస్ట్ చేశారు. జహీరాబాద్‌కు చెందిన గఫూర్, హసీనా బేగంల కుమారుడు (నెల రోజులు)కి కామెర్లు సోకాయి. దీంతో ఆ శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఒక గుర్తుతెలియని మహిళ బాలున్ని ఎత్తుకుంటా అని నమ్మించి ఎత్తుకెళ్లింది. బాధితుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసును ఛేదించారు. ఆదివారం ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు కేసు వివరాలు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం : ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన అబ్దుల్లా అలియాస్ వెంకటేశ్ (35), రేష్మా (30), షహీనా బేగం (28)లు మాసబ్‌ట్యాంక్ ఇందిరానగర్ పోచంబస్తీలో ఉంటున్నారు. అబ్దుల్లా, రేష్మాలు దంపతులు. వీరికి వారసుడు కావాలనే ఉద్దేశంతో ఆసుపత్రి నుంచి శిశువును రేష్మా సోదరి షహీనా బేగం ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కర్నూలులోని పుల్లూరు టోల్‌ప్లాజ్ వద్ద నిందితులను పట్టుకున్నారు.
భర్త వేధింపులు భరించలేక: రేష్మా, షహీనాబేగం అక్కాచెల్లెళ్లు. రేష్మా దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వారసుడిని ఇవ్వలేకపోయావంటూ భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ప్రస్తుతం ఆమె గర్భిణి. నాలుగోసారి అమ్మాయి పుడితే ఎలాగని మనోవేదనకు గురైంది. సోదరి, భర్త సహాయంతో ముగ్గురూ నిలోఫర్‌కు చేరారు. అదే సమయంలో డిశ్చార్జ్ అయిన మగశిశువును గమనించారు. అమ్మమ్మ చేతిలో ఉన్న ఆ శిశువును తెలివిగా ఎత్తుకెళ్లి ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం అపహరణకు గురైన పసికందును బిడ్డ తల్లికి అప్పగించారు.
ఈమధ్య కాలంలో చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. మగ బిడ్డలు కావాలని అత్యాశతో కొంతమంది పిల్లలను కొనడం లేకుంటే అప్పుడే పుట్టిన బిడ్డలను అపహరించడం చేస్తున్నారు. కొందరైతే చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్నారు. పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 'అపరిచితులు పిల్లలను ఎత్తుకుంటా అని నమ్మించి అపహరిస్తారు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. పిల్లలను నమ్మి ఎవరికీ ఇవ్వద్ద'ని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో మరోసారి కిడ్నాప్ కలకలం - జగిత్యాల జిల్లాలో రెండేళ్ల బాలుడి అపహరణ