David Warner unsold IPL Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఈ ఐపీఎల్ 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ తొలి రోజు 84 మంది ప్లేయర్లు వేలం బరిలోకి దిగారు. అయితే 10 ఫ్రాంఛైజీలు కలిపి 72 మంది ప్లేయర్స్‌ను మాత్రమే కొనుగోలు చేశాయి. దీని కోసం రూ.467.95 కోట్లు ఖర్చు చేశాయి. నాలుగు ఆర్టీఎం కార్డులను వినియోగించాయి.
అయితే తొలి రోజు, ప్రపంచ టీ20 క్రికెట్లో విధ్వంసర బ్యాటర్‌గా పేరుగాంచిన డేవిడ్ వార్నర్‌ను బిగ్ షాక్ తగిలింది. ఏ ఫ్రాంఛైజీ కూడా అతటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో వార్నర్ అన్ సోల్డ్ ప్లేయర్‌గా నిలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన మినీ వేలంలో అతడిని రూ. 6.25 కోట్లకు దిల్లీ ఫ్రాంఛైజీ దక్కించుకుంది. కానీ ఈ సారి వార్నర్‌పై దిల్లీతో పాటు మరే ఇతర ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్లో వార్నర్ ఖేల్ ఖతం అయిందా అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
డేవిడ్ వార్నర్ గత సీజన్లో (ఐపీఎల్ 2024) దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచులు ఆడి కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. 21 సగటుతో ఈ పరుగులు సాధించాడు. మొత్తంగా ఐప్పటి వరకు ఐపీఎల్ కెరీర్లో 184 మ్యాచులలో 40.52 యావరేజ్‌తో 6565 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గానూ వార్నర్ నిలిచాడు. మరి అతడిని ఎందుకు తీసుకోలేదో అని క్రికెట్ అభిమానులు తెగ బాధ పడుతున్నారు. అయితే రెండో రోజు వేలంలో అతడిని కొనుగోలు చేసే అవకాశం ఉండొచ్చు.
కాగా, ఈ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా, అత్యల్పంగా ముంబయి ఇండియన్స్ 4 క్రికెటర్లను సొంతం చేసుకుంది. మొత్తంగా పంత్ (రూ.27 కోట్లు), విదేశీ ఆటగాళ్లలో బట్లర్ (రూ.15.75 కోట్లు), అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లలో రసిఖ్ సలాం (రూ.6 కోట్లు) అత్యధిక ధర పలికారు.
తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు
1. డేవిడ్ వార్నర్ (బ్యాటర్)
2. దేవదత్ పడిక్కల్ (బ్యాటర్)
3. జానీ బెయిర్‌స్టో వికెట్ (కీపర్)
4. వకార్ సలాంఖీల్ (బౌలర్)
5. అన్మోల్‌ప్రీత్ సింగ్ (బ్యాటర్)
6. యష్ ధుల్ (బ్యాటర్)
7.ఉత్కర్ష్ సింగ్ (ఆల్ రౌండర్)
8. ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్)
9.. లువ్నిత్ సిసోడియా (వికెట్ కీపర్)
10. కార్తీక్ త్యాగి (బౌలర్)
11. పీయుష్ చావ్లా (స్పిన్నర్)
12. శ్రేయస్ గోపాల్ (స్పిన్నర్)
రికార్డు ధరకు పంత్- అయ్యర్‌పై కాసుల వర్షం- డే 1 కంప్లీట్ లిస్ట్!