Tollywood Pan India Movies 2024 : మూవీ లవర్స్ సూపర్ హిట్, అత్యధిక వసూళ్లు, బాక్సాఫీస్ రికార్డులు వంటి మాటలు విని చాలా రోజులు అయింది. టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌లో కూడా ఈ సమ్మర్‌లో పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. సాధారణంగా పండగ సీజన్‌ల తరహాలోనే సమ్మర్‌లోనూ ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ 2024 సమ్మర్ సీజన్ అందుకు భిన్నంగా ఉంది. మే వరకు ఒక్క భారీ తెలుగు/హిందీ సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు.
- దేవర, కల్కి కోసం ఎదురుచూపులు -గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల్లో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలితో మొదలైన ట్రెండ్‌ను కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, పుష్ప 1, కార్తికేయ 2 కొనసాగించాయి. ఇటీవల హనుమాన్ కూడా ఉత్తరాది ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్‌లో పఠాన్, జవాన్, ఓ మైగాడ్ 2, గద్దర్‌తో పాటు మరో రెండు మూడు చిత్రాలు మాత్రమే ఆడాయి. బాలీవుడ్‌లో ఇటీవలే సమ్మర్ బాక్సాఫీస్ ముందు భారీ అంచనాలతో వచ్చిన బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ సినిమాలు కూడా వసూళ్లు అందుకోవడంలో, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త నిరాశపరిచాయి. దీంతో సమ్మర్ బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించలేదు.
తెలుగు సినిమా పరిస్థితి విషయానికి వస్తే, దేవర, కల్కి 2898 AD వంటి భారీ-బడ్జెట్ మూవీల విడుదల వాయిదా పడడంతో ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చింది. మధ్యలో టిల్లు స్క్వేర్ మినహా ఇతర చిన్న సినిమాలు అవకాశాన్ని అందిపుచ్చుకుని వసూళ్లు సాధించలేకపోయాయి. అయితే రాబాయే నెలల్లో వాయిదా పడ్డ టాలీవుడ్ భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభాస్ కల్కి 2898 AD, జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తెరమీదకు వస్తున్నాయి.