RAM CHARAN UPASANA JANI MASTER : జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగారు. మెగా హీరోలందరితోనూ కలిసి పని చేశారు. మరోవైపు జనసేన పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు. అలానే మెగా ఫ్యామిలీ కూడా తమకు బాగా దగ్గరైన వాళ్లను ఇంటికి పిలిపించి మరీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. అలా తాజాగా జానీ మాస్టర్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ జానీ మాస్టర్‌ను ఇంటికి పిలిచి మరీ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంభలు తెలిపి బహుమతిని ఇచ్చారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు జానీ మాస్టర్. అలానే తనకు రామ్‌చరణ్, ఉపాసన గతంలో ఇచ్చిన ఓ మాటను కూడా నిలబెట్టుకున్నారని అన్నారు. "సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్ అన్నఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకు నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలను చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుంచి అన్న, వదినలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను." అని ట్వీట్లో రాసుకొచ్చారు.