Chiranjeevi Sonali Bendre Indra : చిరంజీవి, సోనాలి బింద్రే కలిసి గతంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇంద్ర'. బి.గోపాల్ దర్శకుడు. ఈ చిత్రం చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న థియేటర్‌లలో రీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ రీరిలీజ్‌పై సోనాలి బింద్రే మాట్లాడారు. ఇంద్ర మూవీ చిత్రీకరణ రోజులను గుర్తు చేసుకున్నారు.
"వైజయంతీ సంస్థలో పని చేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. అశ్వినీదత్ ఎంతో మంచి వ్యక్తి. అలాగే చిరంజీవితో కలిసి నటించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంద్ర సినిమాలో అన్నిటి కన్నా కష్టమైన పని ఆయనతో కలిసి డ్యాన్స్‌లు వేయడమే. ఆయనతో సమానంగా డ్యాన్స్ చేయడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి.
దాయి దాయి దామ్మా సాంగ్ షూటింగ్ ఉందని నాతో చెప్పారు. ఆ భయంతో రాత్రి అంతా నిద్రే పట్టలేదు. ఆ సాంగ్‌లో చిరు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆయన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. నన్ను కూడా వీణ స్టెప్ వేయమంటారని చాలా భయపడ్డాను. రాధే గోవిందా, ప్రేమే కుట్టిందా సాంగ్ చిత్రీకరణలో బాగా ఎంజాయ్ చేశాం. హైదరాబాద్‌లోని పెద్ద సెట్‌లో ఆ పాటను షూట్ చేశారు. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అంతా అప్పుడు సెట్‌లోనే ఉన్నారు. 'ఇంద్ర'ను మళ్లీ వెండి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చిరంజీవి ఫ్యాన్స్‌కు ఇది పండగ రోజు" అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు.