Indian Most Expensive TV Serial Show : సినిమా, సీరియల్, సిరీస్, ఎంటర్టైన్మెంట్ షోస్ ఏదైనా వీటి అంతిమ లక్ష్యం ప్రేక్షకుల్ని అలరించి ఆకట్టుకోవడమే. బుల్లితెరపై లేదా థియేటర్లలో ఇవి ప్రసారమవుతూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఒకప్పుడు సీరియల్, ఎంటర్టైన్మెంట్ షోస్‌తో పోలిస్తే సినిమా బడ్జెట్ మాత్రమే ఎక్కువగా ఉండేది. సీరియల్స్ చాలా తక్కువ ఖర్చుతో తెరకెక్కించేవారు. గతంలో భారతీయ టెలివిజన్‌లో హద్దులు చెరిపేసిన రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ కూడా మెగా బడ్జెట్‌లో రూపొందలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. శతాబ్ద కాలం తర్వాత భారతీయ టెలివిజన్ కార్యక్రమాల బడ్జెట్లు, ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగా పెరిగిపోయాయి. ఎక్కువ బడ్జెట్ అయినా పెట్టేందుకు వెనకాడట్లేదు. సిరీస్‌లు కూడా సినిమా రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి.
అయితే వీటిల్లో ఓ టెలివిజన్ సీరియల్ ఉంది. దాని బడ్జెట్ ఎంతంటే ప్రస్తుతం ఇండియన్ ఇండిస్ట్రీలో ఏ సినిమా కూడా ఆ రేంజ్ భారీ బడ్జెట్‌తో నిర్మించలేదు. అవును మీరు చదివేది నిజం. 2019లో సిద్ధార్థ్ కుమార్ తివారి రామాయణం ఆధారంగా రామ్ సియా కె లవ్ కుష్ అనే మైథాలాజికల్ సీరియల్‌ను రూపొందించారు. ఆ సమయంలో భారతీయ టెలివిజన్‌లో ఇదే అతిపెద్ద షో. ఈ షోకు సంబంధించిన ఒక్కో ఎపిసోడ్ రూపొందించడానికి సుమారు రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేశారట. మిడ్-డే నివేదిక ప్రకారం దీని మొత్తం నిర్మాణ వ్యయం రూ. 650 కోట్లు అని ఉంది. అంటే మరో ఇతర సీరియల్ కానీ, సినిమా కానీ ఇంత బడ్జెట్‌లో రాలేదనే చెప్పాలి.
అందుకే దీనిని బాహుబలితో పోలుస్తుంటారు. టీవీ బాహుబలి అని పిలుస్తుంటారు. 2019లో ఈ సీరియల్ ప్రసారమైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా సాహో ఉండేది. ఈ మూవీ బడ్జెట్ రూ. 350 కోట్లు. అంటే రామ్ సియా కే లవ్ కుష్ షో దీనికి డబుల్ అన్న మాట.