Ileana Do Aur Do Pyaar Movie :'దేవదాసు' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత యి. 'పోకిరి', 'రాఖీ', 'జల్సా', 'కిక్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత స్లోగా బాలీవుడ్‌లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా సూపర్ ఫామ్‌లో దూసుకెళ్లింది. 'బర్ఫీ', 'రుస్తుమ్', 'ఫటా పోస్టర్ నిక్లా హీరో', 'మై తేరా హీరో, 'రాయిడ్' లాంటి సినిమాల్లో చేసింది. అయితే దాదాపు మూడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ చిన్నది, తాజాగా 'దో ఔర్ దో ప్యార్' అనే హిందీ సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి పంచుకుంది. ఆ విషయాలు తన మాటల్లోనే
సినిమాల ఎంపికలో నేను ఆచితూచి వ్యవహరిస్తుంటాను. అందుకే అప్పుడప్పుడు బ్రేక్ వస్తుంది. అయితే ఈసారి మాత్రం అలా కాదు. మంచి పాత్రల కోసం చూస్తున్న సమయంలోనే 2020లో కరోనా వచ్చింది. 'దో ఔర్ దో ప్యార్' సినిమా షూటింగ్ 2021లోనే మొదలైంది. అయితే ఈలోగా నేను ప్రెగ్నెంట్ కావడం, మా బాబు పుట్టడం వల్ల మరింత గ్యాప్ వచ్చింది.
ఈ సినిమాలోని నోరా పాత్రకు, నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలుంటాయి. ఆ పాత్రలాగే నేనూ చాలా సెన్సిటివ్‌గా ఉంటాను. నాకంటూ గాఢంగా ప్రేమించే ఓ వ్యక్తి ఉండాలని కోరుకుంటాను. నచ్చినవాళ్లని హత్తుకోవడం, మనస్ఫూర్తిగా ప్రేమించడం, వాళ్లని బాగా నమ్మడం వంటి పనులు చేస్తుంటాను. జనం ముందు కూడా ఇవన్నీ చేయడానికి నేను వెనకాడను. నోరా కూడా ఇంచుమించు అలాంటిదే. తన సొంతం అనుకున్న వ్యక్తి రోజంతా తనతోనే ఉండాలనుకుంటుంది.