Ilayaraja Manjummel Boys Controversy :ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం "ముంజుమ్మెల్ బాయ్స్" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తమిళ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమాకు 1991లో కమల్ హాసర్ హీరోగా నటించిన 'గుణ' సినిమాలోని 'కన్మనీ అన్బోడ'(కమ్మని ఈ ప్రేమ లేఖ) అనే పాట మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చిందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకూ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే 'ముంజుమ్మెల్ బాయ్స్' చిత్రం సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలకు తెరలేపుతుంది.
తాజాగా తన అనుమతి లేకుండా 'గుణ'లోని పాటను సినిమాలో వాడారని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీకి లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాపీరైట్ యాక్ట్ ప్రకారం..'కన్మనీ అన్బోడ' (కమ్మని ఈ ప్రేమ లేఖ) పాట సృష్టికర్త తానేననీ, దానిమీద పూర్తి హక్కులు తనకే ఉంటాయనీ, తన అనుమతి లేకుండా సినిమాలో పాటను ఎలా వాడతారనీ ఆయన నోటీసులో పేర్కొన్నారు.
ఇందుకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా అందులో పొందుపరిచారట. దానికి 'మంజుమ్మెల్ బాయ్స్' ప్రొడక్షన్ టీమ్ స్పందిస్తూ సరైన అనుమతిని పొందిన తర్వాతే సినిమాలో పాటను ఉపయోగించామని వాదించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.