Sharukh Khan Honey Singh :బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌తో వివాదం గురించి ఎట్టకేలకు హనీ సింగ్ స్పందించారు. తొమ్మిదేళ్ల క్రితం హాట్‌టాపిక్‌గా మారిన ఈ వివాదంపై తాజాగా మాట్లాడారు. యో యో హనీసింగ్ : ఫేమస్ డాక్యుమెంటరీలో ఆయన ఈ విషయం గురించి చెప్పారు. ఆయా కథనాలు చూసి తాను ఎంతో బాధ పడ్డానని పేర్కొన్నారు.
"అమెరికా టూర్‌లో ఉన్నప్పుడు మా మధ్య గొడవ జరిగిందని అప్పట్లో ప్రచారం సాగింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత అసలు నిజం ఇప్పుడు చెబుతున్నాను. షారుక్ ఖాన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాపై ఎప్పుడూ ఆయన చేయి చేసుకోలేదు. యూఎస్ టూర్‌కు మేమిద్దరం వెళ్లాము. అప్పుడు వరుస ఈవెంట్స్ వల్ల నేను బాగా అలసిపోయా. అదే విషయాన్ని మా మేనేజర్లకు చెప్పాను. చికాగో షో క్యాన్సిల్ చేయమని అడిగాను. దానికి వాళ్లు అంగీకరించలేదు. అలా చేయడం కుదరదని అన్నారు. ఇంకో షో చేస్తే నేను చచ్చిపోతానేమో అనిపించింది. అంతలా అలసిపోయాను. ఏం చేయాలో అర్థంకాలేదు. వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలపై ఒక వైపు జుట్టు మొత్తం కత్తిరించుకొని బయటకు వచ్చాను. ఇలా ఈవెంట్‌కు వస్తే బాగోదు కనుక రానని చెప్పాను. క్యాప్ చేతికి ఇచ్చి, దీనిని పెట్టుకుని రండి అన్నారు. అక్కడే ఉన్న కాఫీ మగ్ తీసుకుని తలపై కొట్టుకున్నాను. అలా నాకు గాయమైంది. ఆ సమయంలో షారుక్, నాపై దాడి చేశాడని రూమర్స్ సృష్టించారు. అందులో ఎలాంటి నిజం లేదు" అని హనీసింగ్ అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తన కుటుంబసభ్యులకు విషయం ఫోన్ చేసి చెప్పానని అన్నారు. విషయం తెలిసి వాళ్లు కూడా షాక్ అయ్యారని తెలిపారు.