Hema Committee Report Malayalam Actor Mukesh Rape Case : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక వల్ల ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసుల వరకు నమోదయ్యాయని తెలిసింది. అయితే తాజాగా మరో కేసు నమోదైంది.
కేరళకు చెందిన ప్రముఖ యాక్టర్, అధికార పార్టీ CPI(M) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై రేప్ కేసును నమోదు చేశారు పోలీసులు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఆరోపణలు మేరకు కేసును రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొచి నగరంలోని మారడు పోలీస్ స్టేషన్లో ఐపీసి 376(రేప్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) అమల్లోకి రాకముందే ఈ సంఘటన జరిగినందున ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. హేమ కమిటీ రిపోర్ట్ వెలువరించిన తర్వాత మలయాళ ఇండస్ట్రీలో నమోదైన మూడో హై ప్రొఫైల్ కేసు ఇది.
ఇంకా నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఫోర్ట్ కొచి పోలీస్ స్టేషన్లో సెక్షన్ 354 కింద రాజుపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ విషయాన్ని ఎర్నాకులంకు చెందిన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఇదే సెక్షన్ కింద జయసూర్యపై కేసు రిజిస్టర్ అయినట్లు తిరువంతపురంలోని ఓ పోలీస్ అధికారి చెప్పారు.