Dhanush Tere Ishq Mein Heroine : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'రాంఝనా'. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయితే ఇందులోని పాటలు, అలాగే ధనుశ్ యాక్టింగ్‌కు మూవీ లవర్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈయన హిందీలో నటించిన 'షమితాబ్', 'అత్రంగీ రే' కూడా మిశ్రమ ఫలితాలనే అందుకున్నాయి. కానీ ధనుశ్ మాత్రం అక్కడి ప్రేక్షకలకు బాగా దగ్గరయ్యారు.
ఇక తాజాగా ఈ స్టార్ హీరోతో 'రాంఘనా' డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ మరోసారి సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అయిన 'తేరే ఇష్క్ మే' కోసం ధనుశ్‌ను మెయిన్ లీడ్‌గా ఎంచుకున్నారు. 'రాంఝనా' తరహాలోనే ఓ విషాద ప్రేమకథను ఆయన రూపొందిచనున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావొస్తున్నుప్పటికీ ధనుశ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల దీని నిర్మాణం కాస్త ఆలస్యమైంది. ఒకవేళ అన్నీ సెట్ అయితే దాదాపు ఈ ఏడాది అక్టోబరులోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ సినిమాలో ధనుశ్ ప్రియురాలిగా 'యానిమల్' బ్యూటీ త్రిప్తి దిమ్రీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ టీమ్ ఆమెకు కథ చెప్పగా, త్రిప్తి దానికి ఓకే చెప్పినట్లు సినీ వర్గాల టాక్. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.