NTR Devara:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా 'దేవర'. ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ తర్వాత తారక్ నటించిన సినిమా కావడం వల్ల దేవరపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా, ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. అయితే తాజాగా దేవర పార్ట్- 1కు సంబంధించి ఎన్టీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే?
ఎన్టీఆర్ షూటింగ్ కంప్లీట్
'దేవర పార్ట్- 1'లో తన షూటింగ్ చివరి షాట్ తాజాగా పూర్తయిందని ఎన్టీఆర్ తెలిపారు. దేవర టీమ్‌తో జర్నీ అద్భుతంగా సాగిందని, టీమ్ అందరినీ మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'దేవర పార్ట్ 1లో నా చివరి షాట్ షూటింగ్ పూర్తైంది. ఇదో అద్భుతమైన ప్రయాణం. నేను ఈ సముద్రమంత ప్రేమను, అద్భుతమైన టీమ్‌ను మిస్ అవుతాను. సెప్టెంబర్ 27న రిలీజ్ దాకా వేచి ఉండలేకపోతున్నా' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
కాగా, ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా శివ దేవరను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. కాగా, ఇప్పటికే దేవర నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ - జాన్వీ జోడీ ఆకట్టుకునేలా కనిపించింది. మెలోడియస్ సాగిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లింది.