తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సీనియర్ నటుడు దిల్లీ గణేశ్‌ కన్నుమూత - షాక్​లో కోలీవుడ్ ఇండస్ట్రీ! - DELHI GANESH PASSES AWAY

కోలీవుడ్ ప్రముఖ నటుడు దిల్లీ గణేశ్‌ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Tamil Actor Delhi Ganesh Passes Away
Tamil Actor Delhi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 8:35 AM IST

Tamil Actor Delhi Ganesh Passes Away :కోలీవుడ్ ప్రముఖ నటుడు దిల్లీ గణేశ్‌ కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ తమిళ ఇండస్ట్రీ షాక్​కు గురైంది. ఆయన మృతి పట్ల ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీ అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

తన సినీ కెరీర్​లో ఆయన సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగా, కామెడియన్​గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్​గానూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. చివరగా ఆయన 'భారతీయుడు 2'లో కనిపించారు. అంతకుముందు తెలుగులో 'నాయుడమ్మ', 'జైత్రయాత్ర', 'పున్నమినాగు', లాంటి సినిమాల్లో నటించారు.

దిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం ఎలా సాగిందంటే :
1944 ఆగస్ట్‌ 1న తమిళనాడులోని తిరునెల్వెలిలో జన్మించిన దిల్లీ గణేశ్‌ అసలు పేరు గణేశన్‌. 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళానికి సేవలు అందించారు. అయితే సినిమాలపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్‌ మొదట్లో ఆయన దక్షిణ భారత నాటక సభ (DBNS) థియేటర్‌ గ్రూప్‌ సభ్యుడిగా పనిచేశారు.

1976లో కె.బాలచందర్‌ తెరకెక్కించిన 'పట్టిన ప్రవేశం' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.ఇక గణేశన్‌ను నటుడిగా పరిచయం చేసిన బాలచందరే ఆయనకు దిల్లీ గణేశ్‌ అనే పేరు పెట్టారు. 1981లో వచ్చిన 'ఎంగమ్మ మహారాణి'లో హీరోగా నటించారు. ఆ తర్వాత పలు క్యారెక్టర్ రోల్స్​లో మెరిసి ప్రేక్షకులకు చేరువయ్యారు.

సినిమాల్లోనే కాకుండా, సిరీయల్స్, షార్ట్ ఫిల్మ్ లోనూ నటించారు. తన కుమారుడి కోసం 'ఎన్నుల్ అయర్' అనే సినిమాను నిర్మించాడు. ఇక 1979లో వచ్చిన 'బాసి' చిత్రానికి ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. ఇక 1993-1994 ఏడాదికిగానూ ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల జరిగిన నటీనటుల సంఘం 68వ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయనను జీవిత సాఫల్య పురస్కారం లభించింది.

కమల్ హాసన్​తో దిల్లీ గణేశ్ అనుబంధం :
కమల్ హాసన్​తో దిల్లీ గణేశ్​ పలు హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అపూర్వ సహోదరులు, అవ్వై షణ్ముఖి (బామ్మ రుక్మిణి), నాయగన్(నాయకుడు), మైఖేల్ మదన కామ రాజన్(మైఖేలమ మదన కామరాజు), తెనాలి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details