Deepika Padukone Latest Interview : తన నటనతో అటు నార్త్‌లోనే కాకుండా ఇటు సౌత్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె. జానర్ ఏదైనా సరే తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటిస్తుంటారు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఈమె వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నవయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్టార్డమ్ సంపాదించుకున్నారు. పదిహేడేళ్ల వయసులో తన డ్రీమ్స్‌ను వెతుక్కుంటూ బెంగళూరు నుంచి ముంబయికి చేరుకున్నారు దీపికా. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"సినిమాలంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అంత చిన్న వయసులోనే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నానా? అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆ సమయంలో నేను మనసులో అనుకోగానే చాలా తేలిగ్గా ఇంట్లోంచి బయటికొచ్చేశాను. ఆ టైమ్‌లో నాకు కనీసం చిన్న గది కూడా ఉండేది కాదు. తెలిసినవాళ్ల దగ్గరో, మోడలింగ్ చేసే షూటింగ్ స్పాట్‌లోనో ఉండేదాన్ని. రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తూనే ఉండేదాన్ని. డైరెక్టర్ ఫరాఖాన్ దృష్టిలో పడి, 'ఓం శాంతి ఓం' సినిమాలో ఛాన్స్ వచ్చింది. నా కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి" అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక దీపిక ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ', 'సింగం అగైన్' అనే చిత్రాల్లో నటిస్తున్నారు.