Chiranjeevi Wife Emotional : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన్ను తన మేనత్త చిరంజీవి సతీమణి సురేఖ కలిశారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన ఆమె బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె హత్తుకుని ఏడ్చారు. ఆ తర్వాత తాజా పరిణామాల గురించి మాట్లాడి పరామర్శించారు. తన మేనత్తకు బన్నీ ధైర్యం చెప్పారు. ఇక బన్నీ అరెస్ట్ అయ్యారన్న విషయం తెలియగానే చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో విడుదలైన 'పుష్ప 2' బెనిఫిట్ షోకు (డిసెంబర్ 4) అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే ఆయన రాక తెలిసిన అభిమానులు తనను చూసేందుకు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. అయితే ఆ అభిమానుల గుంపులో ఉన్న రేవతి అనే మహిళ తోపులాట కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
మరోవైపు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు అధికారులు, థియేటర్ యాజమాన్యంలోని ఓ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలానే ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్ పేరును నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల శనివారం ఉదయం జైలు నుంచి బన్నీ విడుదలయ్యారు. అయితే ఈ విషయం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చలకు దారితీసింది. పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. బన్నీని అరెస్ట్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.