Chiranjeevi Savithri: మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై రచయిత సంజయ్ కిషోర్ 'సావిత్రి క్లాసిక్స్' అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి సమక్షంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానటితో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
మహానటి సావిత్రి కళ్లతో హావభావాలు పలికించగలిగే ఏకైక తెలుగు నటి అని చిరంజీవి కొనియాడారు. అలాంటి నటితో మంచి నటుడు అవుతానని అనిపించుకోవడం తనకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు. ఆమెతో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతంగా భావించినట్లు పేర్కొన్న చిరంజీవి ఆమెను తొలిసారి కలిసిన సందర్భాన్ని గుర్తుచేశారు.
'1978లో పునాదిరాళ్లు సినిమా కోసం మేం రాజమండ్రి వెళ్లాం. అప్పుడు నాకు తెలీదు ఆ సినిమాలో మహానటి సావిత్రి గారు నటిస్తున్నారని. ఆ విషయం ఎవరో మూవీ టీమ్ వాళ్లు నాకు చెప్పే సరికి నా ఒళ్లు జలదరించింది. ఇక రాజమండ్రిలో మూవీటీమ్ వాళ్లు ఓ రోజు సావిత్రి గారిని పరిచయం చేసినప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు. ఆవిడను డైరెక్ట్‌గా చూసేసరికి ఏమీ మాట్లాడలేకపోయాను. 'నీ పేరేంటి? బాబు' అని సావిత్రిగారు అడగ్గానే చిరంజీవి అని చెప్పేశా' అని చిరంజీవి తొలిసారి సావిత్రిని కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.