Chhaava Director Apologize: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో దూసుకెళ్తున్న ఈ సినిమా విషయంలో గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వారికి క్షమాపణలు చెప్పారు.
దర్శకుడికి నోటీసులు
ఛావాలో తమ పూర్వీకులను తప్పుగా చూపించారంటూ గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు ఇటీవల ఆరోపించారు. తమ పూర్వీకులకు సంబంధించిన సన్నివేశాల్లో తగిన మార్పులు చేయకపోతే ఊరుకోమని హెచ్చరించారు. న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఛావా దర్శకుడు లక్ష్మణ్‌కు నోటీసులు పంపించారు.
తగ్గిన దర్శకుడు
ఈ నోటీసులపై తాజాగా స్పందించారు లక్ష్మణ్ ఉటేకర్. గానోజీ, కన్హోజీ షిర్కే కుటుంబీకులకు ఫోన్ చేసి క్షమాపణలు తెలియజేశారు. గానోజీ, కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. అందుకే వారికి సంబంధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలను సినిమాలో తాను ఎక్కడా చూపించలేదని పేర్కొన్నారు. షిర్కే కుటుంబం మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఛావా సినిమాతో వారికి ఏదైనా అసౌకర్యాన్ని కలిగించినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.