Bagheera OTT Release : శాండల్‌వుడ్ స్టార్ హీరో శ్రీమురళి, సప్తసాగరాలు ఫేమ్ రుక్మిణీ వసంత్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'బఘీర' మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న పాన్ఇండియా లెవెల్లో థియేటర్లలో రన్ అయిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తుళు ఇలా పలు భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనున్నట్లు పేర్కొంది.
స్టోరీ ఏంటంటే?
వేదాంత్ (శ్రీమురళి)కి చిన్నప్పటి నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. దీంతో అతడు కూడా అలాగే హీరోగా మారాలని ఎప్పుడూ తపనపడుతుంటాడు. అయితే " సూపర్ పవర్స్ ఉన్న వాళ్లే కాదు. ఏ శక్తులు లేకున్నా కూడా ప్రజల్ని కాపాడే తన తండ్రిలాంటి పోలీసులు కూడా సూపర్ హీరోలే" అని ఓ సారి తల్లి చెప్పిన మాటలు విని తను కూడా పోలీస్ అవుతాడు. ఈ క్రమంలో అతడు మంగళూరు ఏసీపీగా ఛార్జ్ తీసుకున్న వెంటనే అక్కడున్న క్రిమినల్ ముఠాల్ని ఏరి పారేయడం మొదలు పెడతాడు. అయితే వేదాంత్ దూకుడు గమనించి ఉన్నతాధికారులు అతడిపై పరిమితులు విధిస్తారు. అది అతడిని చాలా ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా తనకు దక్కిన ఆ పోలీసు ఉద్యోగం కోసం తన తండ్రి రూ.50లక్షలు లంచం ఇచ్చినట్లు తెలుసుకుని అతడు తీవ్రంగా కుంగిపోతాడు. దీంతో తన కళ్ల ముందు జరుగుతున్న నేరాల్ని కూడా పట్టించుకోవడం మానేస్తాడు.