Geethanjali Malli Vachindi Trailer Release : తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హారర్ సూపర్ హిట్ మూవీ గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా ఇది రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్నీ ఫన్నీగా సాగింది.
వివరాల్లోకి వెళితే - 2014లో అంజలి, శ్రీనివాసరెడ్డి లీడ్ రోల్స్ చేసిన గీతాంజలి సినిమా టాలీవుడ్ హారర్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో టాలీవుడ్ ప్రేక్షకులను అప్పట్లో నవ్వించి భయపెట్టింది. సరిగ్గా పదేళ్ల తర్వాత అలాగే నవ్వించి భయపెట్టడానికి మరోసారి గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ ప్రేక్షకులను పలకరించనుంది అంజలి. ఈ సినిమాను MVV సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
గీతాంజలి సినిమాలో ఓ ఇద్దరు కవల అక్కచెల్లెళ్ల గురించి ఉంటే ఈ సీక్వెల్లో ఒక పాడుబడ్డ భవంతిలో షూటింగ్ కోసం వచ్చిన సినిమా యూనిట్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి అనేదే చూపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. మొదటి భాగంలో తమ కామెడీ టైమింగ్‌తో సందడి చేసిన షకలక శంకర్, సత్యం రాజేష్, సత్య ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రల్లో కనిపించనున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
మొదటి భాగంలో విలన్‌గా నటించిన రావు రమేశ్ పాత్ర ఆ సినిమాకే హైలైట్. బ్రహ్మానందం పాత్ర కూడా దెయ్యాలను కంట్రోల్ చేసే వ్యక్తిగా మంచి కామెడీ పండించింది. ఈ సినిమాలో మరి ఆ కామెడీ పండించే పాత్రలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాలి. మరో ప్రధాన పాత్ర చేసిన హర్ష వర్ధన్ రానే కూడా ఈ రెండో భాగం ట్రైలర్లో కనిపించలేదు. అయితే తన గొంతుతోనే భయపెట్టే రవి శంకర్ ఈ సినిమాలో దెయ్యం పాత్రలో కనిపించడం ఈ ట్రైలర్లో మెయిన్ హైలైట్. గీతాంజలిలో ద్విపాత్రాభినయం చేసిన అంజలి తన చావుకు పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో కూడా నటించింది. అయితే రెండో భాగంలో ఒకటి కాదు రెండు కాదు మూడు దెయ్యాలతో ఈ సినిమా యూనిట్ వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా ఆద్యంతం ఫన్నీగా సాగిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచింది.