Amitabh Bachchan Birthday :బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 2024 అక్టోబర్ 11తో 82 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టారు. ఇన్నేళ్ల వయస్సులోనూ ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనే తపన ఆయనలో నిత్యం కనిపిస్తూనే ఉంటుందంటారు సన్నిహితులు. ఐదు దశాబ్దాలకు పైగా నటుడిగా అనుభవమున్న బిగ్ బీ సెట్స్‌లోకి వచ్చేసరికి ఇప్పటికీ ఒక కొత్త యాక్టర్ చూపించినంత శ్రద్దగా షూటింగ్‌కు అటెండ్ అవుతారంట. ఈ వయస్సులో కూడా తమిళ ఇండస్ట్రీలో తొలి సినిమా చేసి, మరింతమంది అభిమానులను పెంచుకున్నారు. రీసెంట్గా 'కల్కి 2898AD', 'వేట్టయాన్' సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
తమిళ యాక్షన్ డ్రామాగా చిత్రీకరించిన ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కించారు. టీ.జే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్ నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళీ స్టార్ పర్ఫార్మర్లతో ఈ తమిళ సినిమా వెయిట్ పెంచేశారు. 2024 అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై విజయదశమి సంబరాన్ని మరింత పెంచేసింది 'వేట్టయాన్'. లైకా ప్రొడక్షన్స్ తన 30వ సినిమా వేట్టయాన్‌తో 'బిగ్ బీ'ని తమిళ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఆయనకు ఇది తొలిసారి కాదు. రజనీ - బిగ్ బీ కాంబోలో వచ్చిన నాలుగో సినిమా ఇది.
- హమ్: కొన్ని దశాబ్దాల కిందటే, 1991లో హిందీ యాక్షన్ క్రైమ్ సినిమా 'హమ్' (Hum)లో నటించారు. ముకుల్ ఎస్ ఆనంద్ దర్శకత్వం వహించగా అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, గోవిందాలాంటి ఇతర ప్రముఖులు అందులో నటించారు. ఈ సినిమాకు 37వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్లో భాగంగా 7 నామినేషన్లతో పాటు 4 అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అందులో అమితాబ్రు ఉత్తమ నటుడు, జుమ్మా చుమ్మా దే దే పాటకు గానూ బెస్ట్ కొరియోగ్రఫర్‌గా చిన్ని ప్రకాశ్ ఎంపికయ్యారు.
- గిరఫ్తార్: ప్రయాగ్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన 'గిరఫ్తార్' సినిమాను ఎస్. రామానాథన్ నిర్మించారు. ఇందులో కమల్ హాసన్, మాధవి, పూనమ్ థిల్లోన్ లీడ్ రోల్‌లో నటించగా, రజనీకాంత్ బిగ్ బీ స్నేహితుడి పాత్రలో కనిపించారు. 1985లో అధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ.
- అంధా కానూన్ : రజనీకాంత్, హేమా మాలినీ, రీనా రాయ్ లీడ్ రోల్స్‌లో కనిపించిన సినిమా అంధాకానూన్(1985). వీరితో పాటు ప్రేమ్ చోప్రా, డానీ డెంజాంగ్పా, ప్రాణ్, అమ్రిష్ పురిలు సహనటులుగా కనిపించగా అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించారు. తమిళ సినిమా సత్తం ఒరు ఇరుత్తరై (1981)సినిమాకు రీమేక్‌గా దీనిని తెరకెక్కించగా, రజినీకాంత్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఈ సినిమా. కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ సినిమా 1983వ సంవత్సరంలో హైయ్యస్ట్ వసూళ్లు సాధించిన 5వ సినిమాగా నిలిచింది