Amaran Saipallavi : కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఆధారంగా ఇది తెరకెక్కింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దీన్ని తెరకెక్కిస్తున్నారు.
శివ కార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన సతీమణి ఇందు రెబెకా పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ స్పెషల్ ఇంట్రో వీడియోను షేర్ చేసింది. ఇందుగా సాయి పల్లవి నటన చూసి సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది.
అలానే తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పింది. "నేను ఇప్పటి వరకు ఎటువంటి బయోపిక్‌లో నటించలేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాను. పాత్రను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పని చేశాను. ఎమోషన్స్‌కు పూర్తి న్యాయం చేయాలని అనుకునేదానిని. అమరన్ అవకాశం వచ్చిన తర్వాత ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని భావించాను. ఇందుకోసం ముకుంద్ భార్య ఇందు రెబెకాను కలిశాను. ఆమెతో ఎన్నో విషయాల గురించి మాట్లాడాను. పాత్రకు సంబంధించిన ఎమోషన్స్‌పై అవగాహన పొందాను" అని సాయిపల్లవి పేర్కొన్నారు.