96 Movie Director About Hero Selection : కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, త్రిష కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బ్లస్టర్ సినిమా '96'. లవ్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ కథ విజయ్ సేతుపతి కోసం రాయలేదని చెప్పుకొచ్చారు. వేరే హీరోని దృష్టిలో ఉంచుకుని తాను ఈ కథ సిద్ధం చేశానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
ఆ బీటౌన్ హీరో కోసమే!
'96' సినిమాను తొలుత హిందీలో తెరకెక్కించాలనుకున్నానని ప్రేమ్ కుమార్ తెలిపారు. హిందీ మార్కెట్‌కు అనుగుణంగా కథ సిద్ధం చేశానని, అభిషేక్ బచ్చన్‌ను హీరోగా పెట్టి ఈ సినిమా రూపొందించాలనుకున్నానని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో అభిషేక్‌ను ఏవిధంగా సంప్రదించాలో తనకు తెలియలేదని వెల్లడించారు. అభిషేక్‌కు సంబంధించిన కాంటాక్ట్స్ కూడా తన వద్దలేవని స్పష్టం చేశారు.
"ఉత్తరాది ప్రేక్షకులు వైవిధ్యమైన వారు. నాకు హిందీ బాగా వచ్చు. మా నాన్న ఉత్తరాదిలోనే పెరిగారు. హిందీ చిత్రాలను ఆయన ఎక్కువగా చూసేవారు. ఆయన వల్లే చిన్నతనంలో నేను కూడా హిందీ చిత్రాలే ఎక్కువగా వీక్షించాను. బాలీవుడ్‌లో నాకు ఇష్టమైన నటుడు నసీరుద్దీన్ షా. ప్రస్తుతం నేనొక స్క్రిప్ట్ సిద్ధం చేశాను. దానిని హిందీలోనే చేయాలనుకుంటున్నా. అక్కడ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకునే సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నాను." అని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చారు.
సీక్వెల్ షురూ
రొమాంటిక్ డ్రామా ఫిల్మ్‌గా '96' తెరకెక్కింది. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట సుమారు 20 ఏళ్ల తర్వాత ఓకే చోట కలిస్తే వారి మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. త్రిష, విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కొన్నాళ్ల క్రితం ప్రేమ్ కుమార్ ప్రకటించారు. '96'కి సీక్వెల్ చేయాలని ముందుగా అనుకోలేదు. ఆ చిత్రానికి దక్కిన ప్రేక్షకాదరణ వల్ల సీక్వెల్ తీస్తున్నాం. స్క్రిప్టు వర్క్ పూర్తైంది. విజయ్ సేతుపతి, త్రిష డేట్స్ ఎప్పుడు అందుబాటులో వస్తే అప్పుడు సినిమా ప్రారంభిస్తాను" అని ప్రేమ్ కుమార్ తెలిపారు.