Balakrishna Aditya 369 Sequel : నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని, బాలయ్య గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఇది రానుందని అన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు బాలయ్య. విడుదల ఎప్పుడవుతుందో తెలిపారు. ఈ విషయాల్ని తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో తెలిపారు.
"ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరితే 2025లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది" అని అన్నారు. కాగా, అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య 369 సినిమాకు సంబంధించిన గెటప్‌లో బాలయ్య స్టేజ్‌పై కనిపించి ఫ్యాన్స్‌ను అలరించారు.
ఇకపోతే 'ఆదిత్య 369' టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. బాలకృష్ణ, మోహిని ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. హీరో భూతకాలం, భవిష్యత్‌లోకి ప్రయాణించి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో అనేదే సినిమా కథ. 110 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ చేశారు. అప్పట్లోనే ఈ చిత్రానికి రూ.కోటిన్నర వరకు బడ్జెట్ పెట్టి తీశారు. 1991 జులై 18న ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.