Anupam Kher Manmohan Singh :భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (92) అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి దిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో మన్మోహన్‌సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకున్నారు.
ఆ సినిమాలో మన్మోహన్ పాత్రను తొలుత అంగీకరించకూడదని భావించినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. 'మన్మోహన్ చాలా తెలివైన వ్యక్తి. మృదుస్వభావి. ఆయనను రెండుసార్లు కలిసే అవకాశం దక్కింది. నిజాయితీపరుడు, గొప్ప నాయకుడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' కోసం మేకర్స్ నన్ను సంప్రదించినప్పుడు ఒప్పుకోకుడదని అనుకున్నా.
కొన్ని కారణాలు, రాజకీయ ఒత్తిడిల వల్ల సినిమా ఒప్పుకోకుడదని అనుకున్నా. కానీ, అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రలో నటించే అవకాశం అందరికీ రాదని అంగీకరించాను. సినిమా కోసం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయనతో సమయం గడిపినట్లే అనిపించింది. నేను చేసిన గొప్ప చిత్రాల్లో ఇదీ ఒకటి. మన్మోహన్‌లా నటించినప్పుడు ఆయనలో ఉండే కొన్ని ఉన్నతమైన లక్షణాలను అలవాటు చేసుకున్నా. ముఖ్యంగా ఇతరులు చెప్పింది వినడం నేర్చుకున్నా. ఆ నీలం రంగు తలపాగా వ్యక్తిని మనమంతా మిస్ అవుతాం. ఆ సినిమా కాంట్రవర్సీ కావొచ్చు. కానీ ఆయన మాత్రం వివాదరహితుడే' అంటూ మన్మోహన్‌ను అనుపమ్ గుర్తుచేసుకున్నారు.