Thyagaraja Music Festival 2025 : నిత్య విద్యార్థిగా ఉండడం వల్లే తాను సంగీత ప్రపంచంలో ఈ స్థాయికి చేరుకున్నానని ప్రసిద్ధ కర్ణాటక వాయులీన విద్వాంసులు, "నాదసుధార్ణవ" పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి అన్నారు. శిల్పారామంలో ఐదు రోజులుగా జరిగిన హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. సంగీతకారులు ఉదయాన్నే సంప్రదాయ పద్ధతిలో ఉంఛవృత్తి, నగర సంకీర్తనలని భక్తితో ఆచరించారు. సంస్కృతి ఫౌండేషన్ వారు డా.అన్నవరపు రామస్వామి గురుసన్మానంతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని సంస్కృతి ఫౌండేషన్ తరపున గండపెండేరాన్ని బహూకరించారు.
వారు చేసిన సేవ అపారమైంది : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులు, మామిడి హరికృష్ణ , ఇంటర్కాంటి నెంటల్ ఛైర్మన్ సీఎల్ రాజం, శ్రీ కూచిబొట్ల ఆనంద్, (సీఈఓ, ఐరా యూనివర్సిటీ, కాలిఫోర్నియా), పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. గురువు స్వయంగా చేసిన కృషితో పాటు, వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దారని, శాస్త్రీయ సంగీతానికి వారు చేసి కృష్టి అపారమైందని గవర్నర్ కొనియాడారు.
ఘనంగా హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం - ప్రేక్షకులను అలరించిన 'మనోమంథన' నృత్యరూపకం
ఆ పైన, దేశవిదేశాల నుంచి వచ్చిన 600 మందికి పైగా సంగీతకారులు శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో కలిసికట్టుగా త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలని ఆలపించారు. ప్రాంగణమంతా ఆ నాదంతో మార్మ్రోగి, శ్రోతలకి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. అదే సమయంలో హనుమత్సమేత సీతారామలక్ష్మణుల, త్యాగరాజ స్వామి ఉత్సవ మూర్తులకి అభిషేక సేవ, ప్రసిద్ధ చిత్రకారులు కూచిచే గాత్రచిత్రసమ్మేళనం జరిగాయి. సాయంత్రం మొదటగా నలుగురు గురుకులం విద్యార్థులు పాటలతో కచేరి ప్రారంభించారు.
అనంతరం సుప్రసిద్ధ విదుషీమణులు షణ్ముఖప్రియ, హరిప్రియల సుమధురగాత్రం పరిసరాలని భక్తిభావంతో ప్రతిధ్వనింపజేస్తూ, ఘనమైన మన సంగీత, సాంస్కృతిక వారసత్వాన్ని శ్రోతల హృదయాలలో సుస్థిరం చేసింది. విద్వాన్ కేవీ కృష్ణ వయొలిన్, విద్వాన్ కోటిపల్లి రమేశ్ మృదంగం, విద్వాన్ కె. శ్యామ్ కుమార్ కంజిర వాద్యసహకారాన్ని అందించారు. కచేరీ పూర్తి కాగానే శ్రోతలు నిలబడి, కరతాళధ్వనుల ద్వారా వారి హర్షామోదాలని తెలియజేశారు. అనంతరం ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన శ్రీ ఆనందమోహన్ ఓరుగంటి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న విద్వాంసులని సన్మానించారు.
శిల్పారామంలో మూడో రోజు ఆకట్టుకున్న త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవాలు
శిల్పారామం వేదికగా హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం - ఐదు రోజుల పండగ