Student Credit Cards : క్రెడిట్ కార్డు అనగానే కేవలం ఉద్యోగులు, వేతన వర్గాలకే ఇస్తారనే భావన చాలా మందికి ఉంటుంది. వాస్తవానికి ఏమీ ఆదాయ వనరులు ఉండని విద్యార్థులు కూడా క్రెడిట్ కార్డులను పొందొచ్చు. ఇందుకోసం ఉండాల్సిన అర్హతలేంటి? బ్యాంకుల నుంచి విద్యార్థులు క్రెడిట్ కార్డును పొందడం ఎలా? ప్రముఖ స్టూడెంట్ క్రెడిట్ కార్డులు ఏవి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అర్హతలు
స్టూడెంట్ క్రెడిట్ కార్డును పొందాలని భావించే వారు నేరుగా బ్యాంకులను సంప్రదించవచ్చు. అయితే ఈ కార్డుకు దరఖాస్తు చేసే విద్యార్థులకు తప్పకుండా 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. తప్పకుండా ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీలో చదువుతుండాలి. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పొందే మార్గాలివే!
- విద్యార్థులు ఏదైనా బ్యాంకులో వారి పేరిట కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై క్రెడిట్ కార్డును పొందొచ్చు. ఎంతైతే డిపాజిట్ చేశారో, అంతే మొత్తాన్ని క్రెడిట్ లిమిట్‌గా మంజూరు చేస్తారు.
- కుటుంబంలో ఎవరికైనా క్రెడిట్ కార్డు ఉంటే, వారి తరఫున విద్యార్థులు యాడ్-ఆన్ క్రెడిట్ కార్డును పొందొచ్చు. విద్యార్థుల కోసం ఈ విధంగా ప్రత్యేక 'యాడ్ ఆన్' క్రెడిట్ కార్డులను బ్యాంకులు జారీ చేస్తుంటాయి.
- కొందరు విద్యార్థులు తమ బ్యాంకు సేవింగ్స్ ఖాతాను సక్రమంగా నిర్వహిస్తుంటారు. తగిన బ్యాలెన్సును, లావాదేవీలను చేస్తుంటారు. వీటిని చూసి పలు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఇస్తుంటాయి.
ఏయే డాక్యుమెంట్లు కావాలి?
- పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, విద్యుత్ బిల్లు వంటివి గుర్తింపు ధ్రువీకరణ కోసం బ్యాంకుకు సమర్పించాలి.
- చిరునామా కోసం ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి.
- పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు సమర్పించాలి.
- యూనివర్సిటీ లేదా కాలేజీ జారీ చేసిన ఐడీ కార్డు తప్పనిసరి.
స్టూడెంట్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
- స్టూడెంట్ క్రెడిట్ కార్డులకు సాధారణంగా ఐదేళ్ల గరిష్ఠ కాలపరిమితి ఉంటుంది.
- కార్డును పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఉచితంగా లేదా కొద్దిపాటి ఫీజుతో కొత్త కార్డును జారీ చేస్తారు.
- వార్షిక ఫీజులు లేదా సభ్యత్వ ఫీజులు దాదాపు ఉండవు.
- దరఖాస్తు ప్రక్రియ చాలా సులభతరంగా ఉంటుంది. పెద్దగా ధ్రువపత్రాలు అవసరం లేదు.
- ఈ కార్డును సక్రమంగా వినియోగిస్తే క్రెడిట్ స్కోరు బాగా పెరుగుతుంది. దీనివల్ల చక్కటి క్రెడిట్ హిస్టరీ తయారవుతుంది.
స్టూడెంట్ క్రెడిట్ కార్డు లోటుపాట్లు
- సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే, స్టూడెంట్ క్రెడిట్ కార్డుల్లో క్రెడిట్ లిమిట్ చాలా తక్కువగా ఉంటుంది.
- సాధారణ క్రెడిట్ కార్డుల కంటే విద్యార్థుల క్రెడిట్ కార్డులపై ఎక్కువ వడ్డీ విధిస్తారు.
- ఈ కార్డులపై కొన్ని అదనపు ఛార్జీలు, ఫీజులు విధించే అవకాశం ఉంటుంది.
- కార్డుతో దుబారా ఖర్చులు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయే ముప్పు ఉంటుంది. అత్యవసరం అయితేనే కుటుంబ పెద్దల సలహాతో ఈ కార్డులు పొందాలి. ఆచితూచి ఖర్చులు చేయాలి.
ప్రముఖ స్టూడెంట్ క్రెడిట్ కార్డులు, వాటి వార్షిక ఫీజులు ఇవే!
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫారెక్స్ ప్లస్ కార్డ్ : వార్షిక ఫీజు లేదు.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐఎస్‌ఐసీ స్టూడెంట్ ఫారెక్స్ ప్లస్ చిప్ కార్డ్ : వార్షిక ఫీజు లేదు.
- ఐడీఎఫ్‌సీ వావ్ క్రెడిట్ కార్డ్ : వార్షిక ఫీజు లేదు.
- ఐసీఐసీఐ బ్యాంక్ స్టూడెంట్ ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డ్ : రూ.499 వార్షిక ఫీజు + జీఎస్టీ.
క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం భారమవుతోందా? EMIలా మార్చుకుని సింపుల్‌గా చెల్లించండిలా!