Aamir Salman Sharukh Movie : బాలీవుడ్ ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇప్పటికీ ఎంతో మంది యంగ్ హీరోస్ వచ్చినా వీరిని బీట్ చేయడం కష్టమనే చెప్పాలి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నుంచి ఈ ముగ్గురే ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ త్రయం కలిసి ఒకే సినిమాలో నటించాలని అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఆశిస్తూనే ఉన్నారు. కానీ అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. అయితే రీసెంట్గా ఈ ముగ్గురూ కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ వేసి అలరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమిర్ ఇప్పుడు తాము ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటించే విషయంపై స్పందించారు.
"మీది, నాది ఒకటే ఆలోచన. రీసెంట్గా షారుక్, సల్మాన్‌ను కలిశాను. మనం ముగ్గురం కలిసి ఒకే ఇండస్ట్రీలో ఇంక కాలం నుంచి పని చేస్తున్నాం. ఇలాంటప్పుడు మనం ముగ్గురం కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోతే ఆడియెన్స్ ఫీలవుతున్నారు. మనం కలిసి ఒక్క సినిమా అయినా చేయొచ్చు కదా అని వాళ్లతో అన్నాను. మళ్లీ రెండు రోజుల క్రితమే సల్మాన్‌ను మరోసారి కలిశాను. మేం ముగ్గురం మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. సల్మాన్ నన్ను కలిసినప్పుడు బీయింగ్ హ్యూమన్ బ్రాండ్‌కు చెందిన డెనిమ్స్ ఓ జత కూడా ఇచ్చాడు." అని పేర్కొన్నారు. కాగా, గతంలో ఆమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ - సల్మాన్ ఖాన్ కాంబినేషన్లలో సినిమాలు వచ్చాయి. కానీ ఈ ముగ్గురు కలిసి ఇప్పటి వరకూ ఒక్క చిత్రంలోనూ నటించలేదు.