70th National Film Awards Winners Reactions :70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం తాజాగా ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. అయితే ఇందులో విజేతలుగా నిలిచిన పలువురు సెలబ్రిటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ వారేమన్నారంటే?
కన్నడ సంస్కృతికి వేడుక
చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కన్నడ చిత్రం 'కాంతార' ఇప్పటికే పలు ప్రశంసలు, అవార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ పాపులర్ కన్నడ ఫిల్మ్, అలాగే బెస్ట్ యాక్టర్ (రిషబ్ శెట్టి) పురస్కరాలకు ఎంపికైంది. ఈ ఆనందాన్ని మూవీ టీమ్ తాజాగా మీడియాతో పంచుకుంది.
'కాంతార' సినిమాకుగానూ నేషనల్ అవార్డు అందుకోవడం మాకు ఎంతో గర్వం, అలాగే గౌరవప్రదం. ఈ గుర్తింపు మా మొత్తం టీమ్ హార్డ్‌వర్క్ అలాగే డెడికేషన్‌కు నిదర్శనమే కాకుండా కన్నడ సంస్కృతికి వేడుక లాంటింది. మాకు 'కాంతార' ఓ సినిమా కంటే ఎక్కువ. లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక అంశాలను తెరపైకి తీసుకురావడమే మా లక్ష్యం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ గుర్తింపు కోసం మేము కేంద్రానికి అలాగే, జ్యూరీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అంటూ 'కాంతర' విజయ్ కిర్‌గందూర్, చలువే గౌడ పేర్కొన్నారు.
ఇది నా కష్టానికి ఫలితం
'ఉంఛాయి' చిత్రానికి గానూ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్త తాజాగా నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అయితే ఆమె ఇదివరకే 1994లో 'వో చోక్రి' అనే సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా గెలుపొందారు. ఈ విషయంపై నీనా ఆనందం వ్యక్తం చేశారు.
"నాకు ఈ అవార్డు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. గతంలో నాకు రెండు జాతీయ అవార్డులు ('బజార్ సీతారాం', 'వో చోక్రి') వచ్చాయి. ఇప్పుడు మరో చాలా సంవత్సరాల తర్వాత మరో నేషనల్ అవార్డు లభించింది. ఇది నాకు చాలా పెద్ద విషయం.కష్టపడి పనిచేయడమే నా మంత్రం. మీరు గొప్పగా పెర్ఫామ్ చేసినప్పటికీ కొన్నిసార్లు మీకు అవార్డు రాని సందర్భాలు ఉన్నాయి, కానీ చివరికి మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఇది నా కష్టానికి ఫలితం. " అంటూ నీనా గుప్త పేర్కొన్నారు.