తెలంగాణ

telangana

ETV Bharat / business

జొమాటోకు రూ.803 కోట్ల GST డిమాండ్‌ నోటీస్‌ - కుదేలవుతున్న కంపెనీ షేర్స్‌ - ZOMATO GETS GST DEMAND

2 శాతం మేర నష్టపోయిన జొమాటో షేర్లు - రూ.803 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు రావడమే కారణం!

Zomato
Zomato (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2024, 9:58 AM IST

Zomato Gets GST Demand : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసులు అందాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై రూ.803.4 కోట్ల మేరు ఉన్న జీఎస్‌టీ బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జొమాటో కంపెనీ వెల్లడించింది.

"2019 అక్టోబరు 29 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్‌టీ బకాయిలు రూ.401.70 కోట్లుగా పేర్కొంటూ మహారాష్ట్రలోని ఠాణె జీఎస్‌టీ కార్యాలయం నుంచి జొమాటోకు ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై వడ్డీ, పెనాల్టీ కింద మరో రూ.401.70కోట్లు చెల్లించాలని ఆదేశించారు" అని జొమాటో కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది చాలా తీవ్రమైన కేసు అని, దీనిపై తాము న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని జొమాటో పేర్కొంది. వాస్తవానికి గతంలోనూ జొమాటోకు ఈ తరహా జీఎస్‌టీ బకాయిల నోటీసులు అందిన విషయం తెలిసిందే.

ట్యాక్స్ కట్టాల్సిందే!
జొమాటోలో కస్టమర్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పుడు బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. అందులో ఆహార పదార్థాల ధర ఒకటి. మరొకటి ఫుడ్‌ డెలివరీ ఛార్జీ. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్‌ ఫీజుపై ఐదు శాతం పన్ను. ఈ ట్యాక్స్‌ను జీఎస్‌టీ మండలి 2022 జనవరి నుంచి అమలు చేస్తోంది.

భారీగా నష్టపోతున్న జొమాటో షేర్లు
జొమాటో కంపెనీకి రూ.803.4 కోట్ల మేర జీఎస్‌టీ డిమాండ్ నోటీస్‌ వచ్చిన నేపథ్యంలో, ఆ కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే దాదాపు 2 శాతం మేర సదరు కంపెనీ షేర్లు నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details