తెలంగాణ

telangana

ETV Bharat / business

అప్పు కన్నా డబుల్ రికవరీ- తిరిగి ఆర్థిక నేరస్థుడినని కామెంట్స్: విజయ్ మాల్యా - VIJAY MALLYA ON ED AND BANKS

విజయ మాల్యా కీలక వ్యాఖ్యలు- బ్యాంకులు, ఈడీ తన అప్పులు కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ చేసుకున్నాయని ట్వీట్లు

Vijay Mallya
Vijay Mallya (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 2:32 PM IST

Vijay Mallya On ED And Banks :తన నుంచి రూ.14,131 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్​సభలో ప్రకటించడంపై బ్యాంకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న విజయ్‌ మాల్యా స్పందించారు. ఈడీతో పాటు బ్యాంకులు తాను చెల్లించాల్సిన అప్పుల కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ చేసుకున్నాయని తెలిపారు.

రెండు రెట్లు ఎక్కువ రికవరీ!
డెట్ రికవరీ ట్రైబ్యునల్ కింగ్‌ ఫిషర్ ఎయిర్​లైన్స్ రుణాన్ని రూ.1200 కోట్ల వడ్డీతో సహా రూ.6,203 కోట్లుగా నిర్ధరించిందని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఎందుకు తన వద్ద బ్యాంకులు, ఈడీ ఎక్కువ డబ్బులు రికవరీ చేసుకున్నాయో చట్టబద్ధంగా నిరూపించాలని కోరారు. అప్పు రికవరీ అయ్యాక కూడా తాను ఆర్థిక నేరస్థుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

'నన్ను ఆర్థిక నేరస్థుడని ఎలా అంటారు'
"నేను కట్టాల్సిన డబ్బులు కన్నా ఈడీ, బ్యాంకులు రెండు రెట్లు ఎక్కువ రికవరీ చేసుకున్నాయి. అయినప్పటికీ నన్ను ఆర్థిక నేరస్థుడని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో పేర్కొన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లోన్​కు సంబంధించి రూ. 8,000 కోట్లకు పైగా ఎక్కువ రికవరీ చేసుకున్నారు. నాకు ఎవరి నుంచి మద్దతు లేదు. ఎవరైనా నాకు అండగా నిలబడి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తారా? అపకీర్తికి గురైన నాకు మద్దతు ఇవ్వడానికి చాలా ధైర్యం కావాలి" అని ఎక్స్ పోస్టుల్లో విజయ్ మాల్యా పేర్కొన్నారు.

'ఆధారాలు ఎందుకు లేవు?'
తాను ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదని మాల్యా వ్యాఖ్యానించారు. 'నాపై సీబీఐ క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం, మరికొందరు విమర్శకులు అంటున్నారు. సీబీఐ ఏ క్రిమినల్ కేసులు పెట్టింది? నేను ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు. దొంగిలించలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణానికి గ్యారెంటర్​గా నేను ఐడీబీఐ బ్యాంక్ అధికారులు సహా అనేక మంది ఇతర వ్యక్తులతో కలిసి రూ.900 కోట్ల రుణాన్ని మోసపూరితంగా పొందినట్లు సీబీఐ ఆరోపించింది. పూర్తి రుణం, వడ్డీ తిరిగి చెల్లించాను. 9 ఏళ్లు గడిచినా మోసం, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు ఎందుకు లేవు?' అని మాల్యా పోస్టు చేశారు.

గ్రాంట్లకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్​లపై చర్చ సందర్భంగా లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించామని చెప్పారు. ఈ ప్రకటనపై విజయ్ మాల్యా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details