Penny Stocks Investment Tips :ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మంచి లాభాలను తెచ్చిపెట్టే స్టాక్స్‌ను కొనుగోలు చేయాలని మదుపర్లు ఆశపడుతుంటారు. అయితే ఇందులో చాలా రిస్క్ ఉంటుంది. అందుకే పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటి? వాటిలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందా? రిస్క్ ఉంటుందా? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, చాలా తక్కువ ధరల్లో ట్రేడయ్యే షేర్లను పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తారు. సాధారణంగా ఈ పెన్నీ స్టాక్స్ ధర రూ.30లోపునే ఉంటుంది. ఈ పెన్నీ స్టాక్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని విక్రయించాలనుకున్నప్పుడు బయ్యర్స్ ఎక్కువగా ఉండరు. కొన్ని పెన్నీ స్టాక్స్ కాలక్రమేణా డీలిస్ట్ అయిపోతాయి కూడా. కనుక పెన్నీ స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లో నష్టభయం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
పెన్నీ స్టాక్స్ ఫీచర్స్
- లిక్విడిటీ లేకపోవడం :సాధారణంగా పెన్నీ స్టాక్స్ క్రయవిక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంటాయి. కనుక లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది.
- రిస్క్ ఎక్కువ :పెన్నీ స్టాక్స్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఇవి కొన్నిసార్లు గణనీయమైన రాబడిని అందిస్తాయి. కానీ అన్ని పెన్నీ స్టాక్స్ మార్కెట్లో రాణించలేవు. కొన్నింటి ధర కాలక్రమేణా క్షీణిస్తుంది.
- మల్టీబ్యాగర్ :కొన్ని పెన్నీ స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ను అందిస్తాయి. అయినప్పటికీ పెన్నీ స్టాక్స్ పెట్టుబడులు అన్నీ కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని చెప్పలేం.
- హెచ్చుతగ్గులు ఎక్కువే :పెన్నీ స్టాక్స్ ట్రేడింగ్‌లో ఒడుదొడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల వార్తల వల్ల పెన్నీ స్టాక్స్ రేటు అమాంతం పెరిగిపోవచ్చు లేదా భారీగా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ వల్ల కూడా పెన్నీ స్టాక్స్ రేట్లు పెరుగుతుంటాయి.
పెన్నీ స్టాక్స్ గురించి మదుపర్లు తెలుసుకోవాల్సిన విషయాలు
స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చినవారు, ట్రేడింగ్‌పై అవగాహన పెంచుకోవాలనుకునేవారు పెన్నీ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ ధర తక్కువగా ఉంటుంది. కనుక చాలా తక్కువ సంఖ్యలో పెన్నీ స్టాక్స్ కొనుక్కుంటే, ఆర్థిక నష్టం పెద్దగా రాదు. పైగా స్టాక్ మార్కెట్ బిగినర్స్ ట్రేడింగ్ చిట్కాలను నేర్చుకోవచ్చు.
- అధిక రాబడి :కొన్ని పెన్నీ స్టాక్స్ దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని మదుపర్లకు అందిస్తాయి. కానీ చాలా ఓపిక అవసరం.
- ఊహాగానాలు :పెన్నీ స్టాక్స్ ట్రేడింగ్ సాంకేతిక విశ్లేషణ కంటే ఊహాగానాల ఆధారంగానే ఎక్కువగా నడుస్తుంది.
- తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ :చిన్న కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక తీవ్ర ఒడుదొడుకులు వచ్చినప్పుడు సదరు కంపెనీలు మూతపడే అవకాశాలు, భారీగా నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి.