Stock Market Today January 21, 2025 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రిలయన్స్, జొమాటో వంటి బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. దీనితో ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఆవిరి అయ్యింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1235 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయి 23,024 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్లు : ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్
- నష్టపోయిన షేర్లు : జొమాటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్
నష్టాలకు కారణాలు:
- డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే, పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోపై 25 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. దీనికితోటు భారత్ సహా ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తామని గతంలోనే అయన అన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
- త్రైమాసిక ఫలితాలతో నిరాశపరిచిన జొమాటో ఈ రోజు భారీగా నష్టపోయింది. దీనికి తోడు బ్లూచిప్ స్టాక్స్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి షేర్లలో అమ్మకాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి.
- అమెరికాలో డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ జనవరి నెలలోనే దాదాపు రూ.50వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను వారు అమ్మేశారు. మార్కెట్ల పతనానికి ఇదీ ఓ కారణం.
- మొదటి రెండు త్రైమాసిక ఫలితాల్లానే ప్రస్తుతం వెలువడుతున్న మూడో త్రైమాసిక ఫలితాలు కూడా నిరాశాజనకంగా ఉండడం కూడా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీసింది.
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దేశంలో వినియోగాన్ని పెంచేందుకు, తయారీని ప్రోత్సహించేందుకు ఈ సారి బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బడ్జెట్‌కు ముందు మదుపర్లు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Rupee Value : డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.58గా ఉంది.
Crude Oil Price : అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 79 డాలర్లుగా ఉంది.