Top 5 Financial Tips :జీవితంలో సక్సెస్ అవ్వడానికి మనకు మనమే అనేక నియమాలు పెట్టుకుంటాం. కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను పాటిస్తాం. ఎంత తినాలి? ఏ టైమ్‌లో తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొవాలి? ఇలాంటి నియమాలు మనలో క్రమశిక్షణను అలవరుస్తాయి. అలాగే డబ్బు విషయంలోనూ నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎక్కడ మదుపు చేయాలి? వంటి విషయాల్లో కొన్ని నియమాలు పాటిస్తేనే ఆర్థికంగా విజయం సాధిస్తాం. అందుకోసం ఆర్థిక నిపుణులు 5 మనీ రూల్స్ సూచించారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. ఆదాయం కంటే తక్కువ వ్యయం
మీ ఖర్చులు మీ సంపాదనను ఎప్పుడూ మించొద్దు. అంటే మీ సంపాదన కంటే మీరు తక్కువ ఖర్చు చేయాలి. ఉదాహరణకు మీరు నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో రూ.15వేలు లేదా రూ.18వేలు మాత్రమే ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన మొత్తాన్ని మీ భవిష్యత్తు కోసం ఆదా చేసుకోండి. లేదంటే ఇతర మాధ్యమాల్లో పెట్టుబడులు పెట్టండి.
మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే మీకు ఎల్లప్పుడూ డబ్బు కొరతగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో రుణాలు, క్రెడిట్ కార్డులపై ఆధారపడాల్సి రావొచ్చు. మీ ఆదాయం కన్నా తక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. దీంతో ఎటువంటి ఆర్థిక ఒత్తిడి ఉండదు.
2. పొదుపు, పెట్టుబడి
మీ సంపాదనలో కొంత మొత్తం ఆదా చేయండి. ఉదాహరణకు, మీరు నెలకు రూ.30,000 సంపాదిస్తున్నారనుకుందాం. అందులో రూ.3వేలు - రూ.5వేలు వరకు ఆదా చేయడానికి ప్రయత్నించండి. ఆ మొత్తాన్ని దీర్ఘకాలంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టండి.
3. అత్యవసర నిధి
మెడికల్ ఎమర్జెన్సీ, ఉద్యోగాన్ని కోల్పోవడం, ఇంటి రిపేర్లు వంటి పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. మీరు 3-6 నెలల వరకు ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి.
ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు రూ.20,000 అయితే, అత్యవసర నిధిలో రూ.60వేలు -రూ.1,20,000 వరకు సేవ్ చేయండి. ఈ డబ్బును సులభంగా యాక్సెస్ చేసుకోగల సేవింగ్స్ ఖాతాలో జమ చేయండి. దీంతో మీకు అవసరం అయినప్పుడు ఎమర్సెన్సీ ఫండ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫండ్ కష్ట సమయాల్లో ఆర్థికంగా మీకు సాయపడుతుంది.