Car Buying Tips And Tricks :కొత్త కారు కొనుక్కోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. కానీ కారు కొనేటప్పుడు మీ మనస్సుతో కాకుండా, బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. లేకుంటే ఇష్టపడి కొనుక్కున్న కారు తరవాత మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే కారు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు? అనే విషయాలు ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
Car Buying Tips In Telugu
1. బడ్జెట్ : మంచి లగ్జరీ కారు కొనాలని అనుకోవడం ఏమాత్రం తప్పుకాదు. కానీ అది మీ బడ్జెట్‌కు మించి ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ మీరు మీ ఆర్థిక స్థితికి మించిన బడ్జెట్‌తో కారు కొంటే, తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే, కారు కొన్న తరువాత దానిని బాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికి బాగా ఖర్చు అవుతుంది. పైగా ఆయిల్ ధరలు ఎలానూ ఉంటాయి. అన్నింటి కంటే కారు సర్వీసింగ్ ఛార్జీలు భారీగా ఉంటాయి. వీటిని సామాన్యులు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, మీ బడ్జెట్‌కే మీరు కట్టుబడి ఉండాలి.
2. రీసెర్చ్ : కారు కొనేముందు మీ బడ్జెట్ రేంజ్‌లో ఉన్న కార్ల గురించి కచ్చితంగా రీసెర్చ్ చేయాలి. అలాగే ఆ కార్లను సరిపోల్చి చూసుకోవాలి. దీని వల్ల ఏ కారులో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో, ఏది మంచి పెర్ఫార్మెన్స్, మైలేజ్ ఇస్తుందో తెలుస్తుంది. అంతేకాదు కార్లపై మీకు మరింత పరిజ్ఞానం పెరుగుతుంది. ఫలితంగా కార్లు అమ్మేవారి ట్రాప్‌లో పడకుండా ఉంటారు.
3. టెస్ట్ డ్రైవ్ : కారు కొనేముందు కచ్చితంగా దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఇందులో ఎలాంటి మొహమాటానికి తావులేదు. అప్పుడే సదరు కారు ఎంత సౌకర్యంగా ఉందో మీకు తెలుస్తుంది. కారు టెస్ట్ డ్రైవ్ చేస్తేనే - కాలు పెట్టుకోవడానికి అనువుగా లెగ్‌రూమ్ ఉందా? డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు స్థిరంగా ఉంటోందా? కారు లోపల విశాలమైన స్థిలం ఉందా? లగేజ్ పెట్టుకోవడానికి కారులోని బూట్ స్పేస్ సరిపోతుందా? ఓవరాల్ డ్రైవింగ్ ఫీల్ ఎలా ఉంది? అనే విషయాలు తెలుస్తాయి. ఫలితంగా ఆ కారు కొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవడానికి వీలు ఏర్పడుతుంది.
4. ఆ విషయం చెప్పవద్దు : చాలా మంది కొత్త కారు కొంటున్నామనే సంతోషంలో సేల్స్ మ్యాన్‌కు తమ బడ్జెట్ గురించి, తమకు ఇష్టమైన మోడల్ గురించి ముందుగానే చెప్పేస్తుంటారు. అలాగే తమకు కావాల్సిన ఫీచర్స్, లైకింగ్స్ గురించి కూడా చెప్పేస్తారు. కానీ అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే, చాలా మంది సేల్స్ మ్యాన్లు చాలా తెలివిగా ఉంటారు. వారు మీ మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేస్తారు. అదనపు ఫీజర్లు, స్పెక్స్, కంఫర్ట్ గురించి చెబుతూ, హైయ్యర్-వెర్షన్ మోడల్‌ను మీకు అంటగడతారు. దీని వల్ల మీపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.
5. షో చేయడానికి కారు కొనవద్దు : బాగా డబ్బు ఉన్నవాళ్లు అయితే ఎలాంటి కారు కొన్నా ఫర్వాలేదు. కానీ బడ్జెట్లో కారు కొనాలని అనుకునేవాళ్లు కచ్చితంగా తమ అవసరాలకు అనుగుణమైన కారు మాత్రమే కొనుక్కోవాలి. మీరు వ్యక్తిగత అవసరాల కోసం కారు కొంటున్నారా? లేదా వారాంతాల్లో సరదాగా డ్రైవ్ చేయాలని అనుకుంటున్నారా? లేదా ప్రతి రోజూ కారు వాడుతుంటారా? కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రయాణించడానికి కారు అనువుగా ఉందా? మొదలైన అంశాల ఆధారంగా బండిని కొనుక్కోవాలి. అంతేకానీ బ్రాండ్ పేరు కోసం, లేదా ఇతరుల ముందు షో చేయడానికి కారు కొంటే, తరువాత మీరే ఇబ్బంది పడతారు.