Top 10 Risk-Free Schemes :మనలో చాలా మందికి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి నష్టభయంలేని, కచ్చితంగా రాబడిని ఇచ్చే ఆదాయ మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. మరి మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.
ఎవరైనా తాము కోరుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వీలైనంత త్వరగా పొదుపు, పెట్టుబడులను ప్రారంభించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందడానికి, అనుకున్న విధంగా ఆర్థిక నిధిని సమకూర్చుకోవడానికి వీలవుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు మీ సంపాదన, దైనందిన, అత్యవసర ఖర్చులు, నష్టాన్ని భరించే శక్తి మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పెట్టుబడులను కొనసాగించగలుగుతారు. అందుకే ఈ ఆర్టికల్‌లో అందరికీ ఉపయోగపడే, ఎలాంటి నష్టభయంలేని, కచ్చితంగా రాబడిని ఇచ్చే 10 పథకాల గురించి తెలుసుకుందాం.
1. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ :స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలంటే భారీ స్థాయిలో మన దగ్గర డబ్బులు ఉండాలి. పైగా నష్టభయం కూడా ఎక్కువగానే ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టాలన్నా ఎక్కువ మొత్తమే అవసరం అవుతుంది. రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడనివారికి ఇవి అంతగా నప్పవు. అందుకే ఇలాంటి వారు ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకోవడం చాలా మంచిది. ఫిక్స్డ్ డిపాజిట్లపై 4 శాతం నుంచి 8.2 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తారు. పైగా వీటి వల్ల ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీ ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు.
2. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ : కేవలం రూ.500తో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్ఠంగా ఎంత మొత్తమైనా దీనిలో పొదుపు చేయవచ్చు.
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ :వయోవృద్ధుల కోసం తీసుకువచ్చిన ప్రత్యేక పథకం ఇది. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనిష్ఠంగా రూ.1000, గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పొదుపు చేయవచ్చు.
4. సుకన్య సమృద్ధి యోజన :ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన పథకం ఇది. ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ వీలును బట్టి నెలవారీగా డబ్బులు కట్టవచ్చు. లేదా ఏడాదికి ఒకసారి ఏకమొత్తంగానూ డబ్బులు చెల్లించవచ్చు.
5. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ (5 సంవత్సరాలు) : ఇందులో ఎవరైనా డిపాజిట్ చేయవచ్చు. నెలకు కనీసం రూ.100 చొప్పున చెల్లిస్తూ ఈ అకౌంట్‌ను మెయింటైన్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. కనుక మీకు వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు.