Things To Know Before Taking An Instant Loan : ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రుణం తీసుకోవడం చాలా సులువైపోయింది. సింగిల్ క్లిక్‌తో ఎటువంటి పత్రాలు ఇవ్వకుండానే రుణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది.
సులువుగా ఇన్‌స్టంట్ లోన్స్ లభిస్తుండడంతో ఈ తరహా రుణాలకు ఆదరణ పెరుగుతోంది. మరి మీరు కూడా ఈ తక్షణ రుణాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- సరైన ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవాలి!
ఆన్‌లైన్‌లో వెతికితే ఇన్‌స్టంట్ లోన్స్ ఇచ్చే సంస్థలు బోలెడు దర్శనమిస్తాయి. వీటిలో చాలా వరకు ఫేక్ సంస్థలు, మోసపూరిత సంస్థలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ వెబ్‌సైట్స్‌లో రుణాలకు సంబంధించిన నియమ, నిబంధనలను పూర్తిగా చదవండి. అలాగే కస్టమర్ రివ్యూలు, రేటింగ్‌లు చూడండి. అప్పుడే అది సరైన ప్లాట్‌ఫాం అవునో, కాదో తెలుస్తుంది. పారదర్శక విధానాలు, సురక్షితమైన ఆన్‌లైన్ లావాదేవీలు, న్యాయమైన రుణ పద్ధతులు అవలంభిస్తున్న సంస్థనే ఎంచుకోండి. అప్పుడే మీరు ఆర్థికంగా, మానసికంగా సుఖంగా ఉండగలుగుతారు. - వడ్డీ రేట్లు విషయంలో జాగ్రత్త!
రుణాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా వడ్డీ రేట్లు గురించి ఆలోచించాలి. సాధారణ రుణాలతో పోల్చితే, ఇన్స్టాంట్ లోన్స్ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు లేట్ పేమెంట్ ఫీజు, ప్రీ పేమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ రుసుములు కూడా వసూలు చేస్తుంటారు. అందువల్ల తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇచ్చే సంస్థలనే ఎంచుకోవాలి. - పేమెంట్ వ్యవధి పెంచుకోగలగాలి!
ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు, ఎలా వస్తాయో చెప్పలేము. అందువల్ల అనుకున్న వ్యవధిలోగా రుణాలు తిరిగి చెల్లించలేకపోవచ్చు. అలాంటప్పుడు సదరు రుణ సంస్థ పేమెంట్ వ్యవధిని పొడిగిస్తుందా? లేదా? అనేది ముందుగానే చూసుకోవాలి. అప్పుడే మీరు ఆలస్య రుసుముల నుంచి, రుణ ఎగవేత ముద్ర నుంచి తప్పించుకోవచ్చు. - కస్టమర్ సపోర్ట్ ఉండాలి!
ఆర్థిక లావాదేవీల విషయంలో కచ్చితంగా కస్టమర్ సపోర్ట్ ఉండాలి. లోన్ తీసుకునేటప్పుడు, తీసుకున్నాక చాలా సమస్యలు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి సరైన కస్టమర్ సపోర్ట్ ఉంటాలి. అందువల్ల చాట్, ఫోన్‌కాల్స్, ఇ-మెయిల్స్ లాంటి బహుళ విధానాల ద్వారా తక్షణమే సమస్యలు పరిష్కరించే ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవాలి. - అవసరం మేరకే రుణం!
కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రుణం కోసం ప్రయత్నించాలి. అది కూడా మీ అవసరాలకు సరిపోయే మొత్తాన్ని మాత్రమే రుణంగా తీసుకోవాలి. చాలా ఈజీగా రుణం లభిస్తోందని, అవసరానికి మించి లోన్ తీసుకుంటే, తరువాత మీరే ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అందువల్ల ఇన్స్టాంట్ లోన్ తీసుకునే ముందు, మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు లాంటి విషయాలను కచ్చితంగా సమీక్షించుకోండి. ఆ తర్వాతే తక్షణ రుణాలు తీసుకోవాలా? లేదా? అనేది నిర్ణయించుకోండి.