తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు క్రాష్- రూ.5లక్షల కోట్లు ఆవిరి- భారీ నష్టాలకు కారణాలు ఇవే! - STOCK MARKET TODAY

స్టాక్ మార్కెట్ క్రాష్‌- సెన్సెక్స్‌ 856 పాయింట్స్‌, నిఫ్టీ 242 పాయింట్స్ డౌన్‌!

Stock Market Today
Stock Market Today (IANS)

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2025, 3:38 PM IST

Stock Market Today February 24th 2025 :దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదో రోజు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఐటీ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి. మదుపరుల సంపద ఏకంగా రూ.5లక్షల కోట్ల మేర ఆవిరైంది. యూఎస్‌లో వినియోగాదారుల డిమాండ్ తగ్గడం, మరోవైపు ట్రంప్‌ టారిఫ్ బెదిరింపుల కారణంగా యూఎస్‌, ఆసియా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్లపై కూడా పడింది.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,545 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 242 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద ముగిసింది.

  • లాభపడిన షేర్లు :ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌, మారుతి సుజుకి, ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్‌
  • నష్టపోయిన షేర్లు :హెచ్‌సీఎల్‌ టెక్‌, జొమాటో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌

రంగాలవారీగా చూస్తే
నిఫ్టీ బ్యాంక్‌, ఫైనాన్సియల్ సర్వీసెస్‌, మెటల్‌, ఐటీ, రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌, ఆయిల్ & గ్యాస్ సూచీలు దాదాపు 1%- 2.5% వరకు పడిపోయాయి. బీఎస్‌ఈలోని అన్ని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ ఏకంగా రూ.5.07 లక్షల కోట్లకు తగ్గి రూ.397.13 లక్షల కోట్లకు చేరింది.

నిఫ్టీ గత 28 సంవత్సరాల్లో అత్యంత దారుణమైన నెలవారీ నష్టాలను చవిచూసింది. దీనిలో నిఫ్టీ లాభాలు, వృద్ధి రేటు రెండూ బాగా తగ్గిపోయాయి.

ఫిబ్రవరిలో నిఫ్టీ 50, సెన్సెక్స్‌ రెండూ దాదాపు 4 శాతం మేర క్షీణించాయి. 2024 సెప్టెంబర్‌ 27న నమోదైన గరిష్ఠ లాభాల స్థాయి నుంచి అవి వరుసగా 13.8 శాతం, 12.98 శాతం మేర పతనమయ్యాయి.

స్టాక్ మార్కెట్ పతనానికి కారణం ఏమిటి?

1. వినియోగదారుల డిమాండ్ తగ్గడం :అమెరికాలో సుంకాల పెంపు, వ్యయ ఒత్తిళ్లు కారణంగా ఆందోళనలు నెలకొన్నాయి. దీనితో ఫిబ్రవరిలో యూఎస్‌ వినియోగదారుల డిమాండ్ భారీగా (71.7 శాతం నుంచి 64.7 శాతానికి) పడిపోయింది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని మెక్సికోపై ట్రంప్ సర్కార్‌ ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఇండియన్ స్టాక్‌ మార్కెట్లపై పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి.

2. స్టాగ్‌ఫ్లేషన్ భయాలు :అమెరికాలో స్టాగ్‌ఫ్లేషన్ భయాలు కూడా నెలకొంటున్నాయి. అంటే ఓ వైపు ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, మరోవైపు వృద్ధి మందగిస్తోంది. దీనితో భారతీయ ఐటీ వంటి ఎగుమతి ఆధారిత రంగాలపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతేకాదు దీని వల్ల ఆభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని, యూఎస్‌ డాలర్‌, ట్రెజరీల వంటి సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ల వైపు మళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.8 శాతం మేర పడిపోయింది. మఖ్యంగా ఎల్‌టీటీఎస్‌, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, కోఫోర్జ్‌ బాగా నష్టపోయాయి.

3. ముందు జాగ్రత్త: శుక్రవారం యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌ ద్రవ్యోల్బణ డేటాను విడుదల చేయనుంది. ఒక అంచనా ప్రకారం, ఇన్‌ఫ్లేషన్‌ 2.8 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా. ఒక వేళ ఇదే జరిగితే ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఇది మదుపరులకు మంచి అవకాశమే. కానీ ట్రంప్ టారిఫ్‌లు పెంచుతామని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మదుపరులు ఏం చేయాలో తెలియక కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

4. ఎఫ్‌ఐఐ అమ్మకాలు :దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నిరంతరంగా జరుగుతూనే ఉంది. ఎన్‌ఎస్‌డీఎల్ డేటా ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు 2025లో ఇప్పటి వరకు నికరంగా రూ.1,01,737 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.

5. భౌగోళిక ఉద్రిక్తతలు :రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొన్నాయి. ఇవి ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు.

6. రూపాయి పతనం : రూపాయి పతనం కావడం, దేశంలో అమెరికా డాలర్‌ రిజర్వ్‌లు తగ్గడం, దేశీయంగా కార్పొరేట్‌ సంస్థల డిసెంబరు త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, జీడీపీ వృద్ధిపై ఆందోళనలు కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. ఇవన్నీ దేశీయ మార్కెట్లపై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details