తెలంగాణ

telangana

ETV Bharat / business

వాట్సాప్, టెలిగ్రామ్​ల్లో 'ఫేక్​ స్టాక్ మార్కెట్ టిప్స్'​ - గుడ్డిగా నమ్మారో నష్టపోవడం ఖాయం! - Stock Market Scams Via WhatsApp

Stock Market Frauds Via WhatsApp : మీరు స్టాక్ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మరింత ఎక్కువ లాభాలు రావాలని ఆశిస్తున్నారా? అయితే జర జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు, నకిలీ ఆర్థిక నిపుణులు వాట్సాప్​, టెలిగ్రామ్ గ్రూప్​లో స్టాక్ మార్కెట్ టిప్స్​ అందిస్తామంటూ, మదుపరులను ఆకర్షిస్తున్నారు. వీటిని నమ్మారో, ఇక అంతే. భారీగా నష్టపోవడం ఖాయం.

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 1:13 PM IST

Share Market Scams Via WhatsApp
Stock Market Frauds Via WhatsApp (ETV Bharat)

Stock Market Frauds Via WhatsApp : నేటి కాలంలో సైబర్ నేరాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసం చేస్తుంటే, మదుపరుల అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు మరికొందరు. తాజాగా ఈ సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లపై దృష్టి సారించారు. వాట్సాప్​, టెలిగ్రామ్, ఫేస్​బుక్​ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ టిప్స్ అందిస్తామంటూ ఉచ్చు పన్నుతున్నారు. ఈ ట్రాప్​లో పడిన అమాయకుల నుంచి భారీగా డబ్బులు దోచుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త!

ఇటీవలే పుణెకు చెందిన ఇద్దరు సోదరుల నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.2.5 కోట్లు కొట్టేశారు. ఇదే తరహా మోసాలు ఇంకా చాలానే జరుగుతున్నాయి. అందుకే ఈ మోసాల బారి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర వేస్తారు - డబ్బులు కొట్టేస్తారు!
మేకను బలి ఇవ్వాలంటే, ముందుగా దానికి ఎర వేయాలి. సైబర్‌ నేరగాళ్లు కూడా అచ్చం ఇదే టెక్నిక్​ను అనుసరిస్తున్నారు. ముందుగా అమాయకులైన మదుపరులకు ఫోన్ చేస్తారు. లేదా వాట్సప్‌, టెలిగ్రామ్​ లాంటి సోషల్‌మీడియా ప్లాట్​ఫామ్స్​ ద్వారా సంప్రదిస్తారు. చాలా నమ్మకంగా మాట్లాడి, లాభాల ఎర వేస్తారు. ఉచితంగా షేర్ మార్కెట్ టిప్స్ అందిస్తామని, దానితో బాగా డబ్బులు సంపాదించవచ్చని నమ్మిస్తారు. మిమ్మల్ని వారి వాట్సాప్ గ్రూప్​ల్లో చేరుస్తారు.

జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ లాంటి ప్రముఖుల పేర్లతోనూ నకిలీ వాట్సప్‌ గ్రూపులు, సోషల్‌మీడియా అకౌంట్లు తెరుస్తారు. వాటిని నిజమైనవాటిగా నమ్మించి ప్రజలను బుట్టలో వేసుకుంటారు. ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది.

అరచేతిలో వైకుంఠం
సైబర్ నేరగాళ్లు, నకిలీ ఆర్థిక నిపుణులు వాట్సాప్​, టెలిగ్రామ్​ గ్రూప్​ల ద్వారా స్టాక్ మార్కెట్ టిప్స్ పంపిస్తారు. గ్రూపులోని మిగతా సభ్యులు వాటిని పాటించి, భారీగా లాభాలు సంపాదించినట్లు చెబుతుంటారు. ఒకవేళ ఈ టిప్స్ పాటించకపోతే, మంచి అవకాశం కోల్పోతామేమోనని మదుపరులు భ్రమపడేలా చేస్తారు. భారీ లాభాలు వస్తాయంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. మొత్తంగా వారిని బుట్టలో వేసుకుని పెట్టుబడులు పెట్టిస్తారు.

నకిలీ ట్రేడింగ్ అకౌంట్​ను, సాఫ్ట్​వేర్​లను సృష్టించి, వాటిని మదుపరులకు అందిస్తారు. వీటిలో పెట్టిన చిన్నచిన్న పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చినట్లు చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ డబ్బులు తీయాలని ప్రయత్నిస్తే, సెబీ మీ అకౌంట్​ను లాక్ చేసిందని లేదా ఫండ్స్ నిలిచిపోయాయని అంటారు. లేదా మీ డబ్బులు మీకు రావాలంటే, ముందు పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. ఫోర్ట్​ఫోలియో ఛార్జీలు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న డబ్బు అంతా దోచుకుంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, చాలా మందికి తాము మోసపోయామన్న విషయం కూడా తెలియదు.

ఏకంగా రూ.2.45 కోట్లు కొట్టేశారు!
సైబర్ నేరగాళ్ల బారిన పడి ఇటీవలే పుణెకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా రూ.2.45 కోట్లు కోల్పోయారు. ఒకరు రూ.1.68 కోట్లు, మరొకరు రూ.77.50 కోట్లు నష్టపోయారు. ఎలా అంటే?

సైబర్ నేరగాళ్లు ఈ ఇద్దరు సోదరులతో భారీగా పెట్టుబడులు పెట్టించి, ఏకంగా రూ.8 కోట్లు వరకు లాభం వచ్చిందని నమ్మించారు. తీరా సొమ్ము వెనక్కు తీసుకుందామని వారు ప్రయత్నించినప్పుడు, అసలు మోసం బయటపడింది.

ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

  • ఆన్​లైన్​లో పరిచయమైన వారిని తొందరగా నమ్మేయకూడదు.
  • మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలు ఎవరికీ చెప్పకూడదు.
  • మీ అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూప్​ల్లో మిమ్మల్ని ఎవరైనా చేర్చితే, వెంటనే వాటి నుంచి బయటకు వచ్చేయండి.
  • వాట్సాప్​, టెలిగ్రామ్, ఫోన్​ల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్ టిప్స్​ను అస్సలు నమ్మకండి.
  • సోషల్ మీడియా అకౌంట్లలో ఉండే లింక్​లపై క్లిక్ చేయకండి.
  • అనధికార ఏపీకే ఫైల్స్​ను, థర్డ్ పార్టీ యాప్​లను డౌన్​లోడ్ చేసుకోవద్దు.
  • మీ అనుమతి లేకుండా, ఎవరూ మిమ్మల్ని వాట్సప్‌, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చడానికి వీలు లేకుండా, సెట్టింగ్స్‌ మార్చుకోవాలి.
  • ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలన్నా, సెబీ సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ఎక్స్​పర్ట్ నుంచి మాత్రమే సలహాలు తీసుకోవాలి.
  • యూట్యూబ్​ లాంటి ప్లాట్​ఫామ్స్​లో ఉండే నకిలీ ఎక్స్​పర్ట్స్​ మాటలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకండి.

మీరు అతిగా షాపింగ్​ చేస్తున్నారా? 'స్పావింగ్' ట్రాప్​లో పడ్డారేమో చూసుకోండి - లేకుంటే ఇక అంతే! - What Is Spaving

భవిష్యత్​కు భరోసా కావాలా? ఈ టాప్​-5 పెన్షన్ స్కీమ్స్​పై ఓ లుక్కేయండి! - Top 5 Pension Plans In India

ABOUT THE AUTHOR

...view details