Stock Market Closing Today :దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1062 పాయింట్లు నష్టపోయి 72,604 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 21,957 వద్ద ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.393 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ గురువారం ఉదయం 73,499.49 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా అలానే కొనసాగింది. ఇంట్రాడేలో 72,334.18 కనిష్ఠానికి చేరిన సూచీ చివరకు 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టపోయాయి. నిఫ్టీలో హీరో మోటాకార్ప్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో ముగిశాయి. లార్సెన్, ఏషియన్ పేయింట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, దివిస్ ల్యాబ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారీ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కాస్త పెరిగి 84.16 డాలర్లకు చేరింది.