SBI Har Ghar Lakhpati Scheme : తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఎస్‌బీఐ కొత్త డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. అదే ఎస్‌బీఐ 'హర్ ఘర్ లఖ్‌పతి' రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో పొదుపు చేస్తే మీరు లక్షాధికారి అయిపోవచ్చు. మరి అందుకోసం నెల నెలా ఎంత పొదుపు చేయాలి? స్కీమ్ వివరాలేంటి? తెలుసుకుందాం.
'హర్ ఘర్ లఖ్ పతి'పథకం అంటే ఏమిటి?
హర్ ఘర్ లఖ్‌పతి పథకం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ పథకం. ఈ స్కీమ్ కస్టమర్లు సులభంగా, ప్రణాళికాబద్ధంగా డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కస్టమర్లు ఇల్లు కొనడం, వివాహ ఖర్చులు వంటి ఆర్థిక అవసరాల కోసం వాడుకోవచ్చు. ఈ పథకం కింద పెద్దలు, పదేళ్లు దాటిన మైనర్లు డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు.
హర్ ఘర్ లఖ్‌పతి పథకం పొదుపు వ్యవధిని ఏడాది నుంచి 10ఏళ్ల మధ్య ఎంచుకోవచ్చు. మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ప్రకారం మీ డబ్బును పొదుపు చేసుకోవడం ఉత్తమం. రెండేళ్లు కంటే ఎక్కువ కాలపరిమితి గల పొదుపునకు వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ కస్టమర్లకు 7శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25శాతం వరకు పొదుపుపై వడ్డీ రేటు అందుతుంది.
ఎంత కట్టాలి? వడ్డీ ఎంత?
- ఒక సాధారణ పౌరుడు మూడేళ్ల కాలానికి నెల నెలా రూ.2,500 చెల్లించినట్లయితే వడ్డీ 6.75 శాతంతో మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.1 లక్ష అందుతాయి.
- ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకుని సాధారణ కస్టమర్ నెలకు రూ.1407 చెల్లిస్తే 6.50 శాతం వడ్డీతో చేతికి రూ.1 లక్ష వస్తాయి.
- 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ అయితే 3 ఏళ్ల కాలానికి నెలకు రూ.2480 కడితే 7.25 శాతం వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత రూ.1 లక్ష వస్తాయి. ఐదేళ్లకు అయితే నెలకు రూ.1389 చొప్పున కట్టాలి. వడ్డీరేటు 7శాతం ఉంటుంది.
విధివిధానాలు- అర్హతలు
ఎస్‌బీఐ తీసుకొచ్చిన హర్ ఘర్ లఖ్‌పతి ఆర్‌డీ స్కీమ్‌లో భారతీయ పౌరులందరూ వ్యక్తిగతంగా లేదా జాయింట్ ఖాతా తెరిచి చేరవచ్చు. ఎస్‌బీఐ బ్రాంచ్‌లో లేదా ఆన్ లైన్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు సైతం ఆర్‌డీని తెరవొచ్చు. లేదా తల్లిదండ్రులు/ సంరక్షకులు వారి పేరు మీద ఖాతా ఓపెన్ చేయొచ్చు. మీరు చెల్లింపును కోల్పోయినా, ముందుగానే డబ్బును ఉపసంహరించుకున్నా ఫైన్ పడుతుంది.
మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? మంచి రాబడిని ఇచ్చే టాప్-5 స్కీమ్స్ ఇవే!
పేద విద్యార్థులకు రూ.10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్- ష్యూరిటీ అవసరం లేదు - అప్లై చేసుకోండిలా!