Second Hand Luxury Cars Pros And Cons : చాలా మందికి లగ్జరీ కారుకొనుగోలు చేయాలనే కల ఉంటుంది. కానీ భారీ మొత్తంలో ధర చెల్లించి కొత్త కారు కొనుగోలు చేసే శక్తి వారికి ఉండదు. అందుకే కనీసం సెకెండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం లాభదాయకంగా ఉంటుందా? లేదా?
ఈ మధ్యకాలంలో సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల మార్కెట్ భారత్లో ఏటా 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతోంది. సగటున ఏడాదికి 60వేలకు పైగా యూజ్డ్ లగ్జరీ కార్ల విక్రయాలు జరుగుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు కూడా సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల అమ్మకాల కోసం, అనేక షోరూంలను తెరుస్తున్నాయి. అంతేకాదు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. అయితే ఈ సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల కొనుగోలు వల్ల లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తరుగుదల :
లగ్జరీ కారు ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే కొత్త కారు షోరూం నుంచి బయటకు వచ్చిన వెంటనే, దాని విలువ మార్కెట్లో తగ్గుతుంది. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో కారు ధర 15 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గిపోతుంది. 5 ఏళ్ల తర్వాత అది సగం విలువను కోల్పోతుంది. అదే విధంగా తరుగుదల రేటు కూడా టైమ్ గడుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇది కొత్త కార్లను కొనుగోలు చేసిన యజమానులకు నష్టమే. కానీ వారి నుంచి సదరు లగ్జరీ కారును కొనుగోలు చేసేవారికి మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. అందుకే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొత్త కారు కొనలేనివారికి సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు మంచి ఆప్షన్ అవుతుంది.
తక్కువ ధరతోనే లగ్జరీ కారు :
సాధారణ కారు కొనుగోలుకు అయ్యే బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ డబ్బులు పెడితే, సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు లభిస్తుంది. ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడీస్ బెంజ్, ల్యాండ్ రోవర్ లాంటి బ్రాండ్ల సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు సగటు ధర రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఇవే కొత్తవి అయితే రూ.50 లక్షల నుంచి రూ.65 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. ఉదాహరణకు కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320డి లగ్జరీ ఎడిషన్ ధర రూ.60.50 లక్షలు ఉంటుంది. కానీ అదే 2015 మోడల్ కారును కేవలం రూ.21 లక్షల నుంచి రూ.22 లక్షలతో కొనుగోలు చేయవచ్చు. ఇది కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా, హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ ధరతో దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారు కొనుగోలు కచ్చితంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు.
లేటెస్ట్ ఫీచర్స్ :
కారు కొనుగోలు చేసేవారు అందులో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని ఆశిస్తారు. అందుకే ఎక్కువగా లగ్జరీ కార్లవైపు మొగ్గుచూపుతారు. సాధారణ కార్లతో పోలిస్తే లగ్జరీ కార్లు చాలా సురక్షితమని చెప్పవచ్చు. లగ్జరీ కార్లలో 6/7ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీ కెమెరా, యాంటీ థెఫ్ట్ ఫీచర్లు ఉంటాయి. అలాగే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఎనేబుల్ చేయడానికి కార్లు ఆటోమెటిక్ అండ్ లేటెస్ట్ సెన్సార్లను కలిగి ఉంటాయి. నాన్ లగ్జరీ కార్లలో లేని ఫీచర్లు సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్లలో ఉంటాయి. కనుక వీటిని కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది.