SEBI Employees Protest To Seek Madhabi Puri Buch Resignation : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ (SEBI) ప్రధాన కార్యాలయం బయట ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలో దాదాపు 200 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. కానీ వారెవరూ మీడియాతో మాట్లాడలేదు. బుధవారం సెబీ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే మాధబి పురి బచ్ రాజీనామా చేయాలని ప్లకార్డులు పట్టుకుని 90 నిమిషాల పాటు భవంతి ముందే నిలబడి నిరసన తెలిపారు. ఆ తరువాత విధులకు హాజరయ్యారు. నెల క్రితం కూడా సెబీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కానీ వాటికి ఉద్యోగ సంఘాల/యూనియన్ల మద్దతు లభించలేదు.
గట్టిగా అరుస్తారు, అవమానిస్తారు!
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ ప్రవర్తన గురించి, ఆ సంస్థలో పనిచేసే 500 మందికిపైగా ఉద్యోగులు ఆర్థిక శాఖకు ఆగస్టు 6న లేఖ రాశారు. కార్యాలయంలో పనివాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉందని, మాధబి పురి బచ్ తమపై అనవసరంగా కేకలు వేయడం, అందరి ముందు అవమానించడం వంటివి చేస్తుంటారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలోని వివరాలు ఇటీవల మీడియాలో వచ్చాయి. దీనితో అటువంటిదేమీ లేదంటూ సెబీ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఆర్థిక శాఖకు లేఖ రాయాలని, మీడియా వద్దకు వెళ్లాలంటూ జూనియర్ అధికారులకు పదేపదే బయటి వ్యక్తులు నూరిపోసినట్లు మాకు అనుమానంగా ఉంది. సెబీ ఉద్యోగుల సంఘాలు ఏవీ ఆ లేఖ పంపలేద'ని సెబీ వివరించింది.