Summer Tips to Protect Car or Bike from Fire Accident : సమ్మర్ వచ్చిందంటే చాలు వాహనాల్లో పొగలు రావడం, కార్లలో(Cars) మంటలు ఎగిసి పడటం, ద్విచక్ర వాహనాలు టైర్లు పేలిపోవడం వంటి ఘటనలు మనం తరచుగా చూస్తుంటాం. కాబట్టి, వాహనదారులు అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. లేదంటే.. ఎండకు వాహనాలు కాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి, సమ్మర్‌లో వాహనదారులు పాటించాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంజిన్ వేడెక్కకుండా చూసుకోవాలి :వేసవిలో వాహనాల్లో ప్రమాదాలు సంభవించడానికి ఇంజిన్ ఓవర్ హీట్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు ఆటో మొబైల్ రంగ నిపుణులు. కాబట్టి, వేసవిలో వాహనం నడిపే సమయంలో ఇంజిన్ ఉష్ణోగ్రతను పరిశీలిస్తుండాలని చెబుతున్నారు. ఎందుకంటే.. గంటల తరబడి వాహనాలు నడపడంతో ఇంజిన్ వేడెక్కి వైర్లు, పైపులు చెడిపోయి మంటలు వ్యాపించే అవకాశముందని సూచిస్తున్నారు. అంతేకాకుండా వాహనం బయటకు తీసే ఇంజిన్ ఆయిల్ సరిచూసుకోవాలి. ఆయిల్ తక్కువైతే ఇంజిన్ వేడెక్కి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఇంజిన్ కూలింగ్ :సమ్మర్‌లో వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఉండాలంటే ఇంజిన్ కూలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎండాకాలం ఇంజిన్, రేడియేటర్లలో డస్ట్ జామ్ అవుతుంది. దీంతో కూలెంట్‌లో వేడి నీరు చల్లబడకుండా అందులోనే ఉండి ఇంజిన్ వేడెక్కుతుందంటున్నారు నిపుణులు. అప్పుడు ఇంజిన్, రేడియేటర్లను నీటితో శుభ్రం చేస్తే త్వరగా వాహనం చల్లబడుతుందని చెబుతున్నారు.
మీ కారు నుంచి పొగ ఎక్కువగా వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!
టైర్ కండిషన్ :వేసవిలో వాహనం ప్రమాదానికి గురికాకుండా ఉండాలంటే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం.. టైర్ కండిషన్. ఎందుకంటే.. బ్రేక్ స్లిప్పులు సరిగా లేకపోతే స్ట్రక్ అయి టైర్లలో మంటలు వస్తుంటాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, టైర్లకు నాణ్యతా పరీక్ష చేయించి.. అరిగిపోయినట్లు తేలితే మార్చుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా వెహికల్ టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా టైరు పగిలిపోయి వాహనం అదుపు తప్పే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫుల్ ట్యాంక్‌తో ప్రమాదమే : చాలా మంది ఎల్లప్పుడూ వాహనాల్లో ట్యాంక్ నిండా ఇంధనాన్ని నింపిస్తుంటారు. అయితే, వేసవికాలంలో ఫుల్ ట్యాంక్ చేయిస్తే వేడికి ట్యాంక్‌లో రసాయన చర్యలతో గ్యాస్‌ఫాం అయి బరస్ట్ అయ్యే ప్రమాదముందంటున్నారు నిపుణలు. కాబట్టి, సమ్మర్‌లో వీలైనంత వరకు ఫుల్ ట్యాంక్ కొట్టించకపోవడం మంచిదంటున్నారు.
బ్యాటరీ :సమ్మర్‌లో మీ కార్లకు అదనపు లైట్లు, హారన్లు, ఇతర పరికరాలను అమర్చుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు అమర్చే పరికరాల వైర్లలో నాణ్యత ఉండకపోవచ్చు. ఫలితంగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
వెహికల్ కండిషన్ :వీటితో పాటు సమ్మర్‌లో వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా ఉండడానికి వెహికల్‌ను ఎప్పుడూ కండిషన్లో ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే వాహనాల్లో ఎలాంటి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా సమ్మర్‌లో మీ బైక్ లేదా స్కూటర్ పెట్రోల్ ట్యాంక్‌పై నిత్యం కవర్‌ను కప్పి ఉంచాలని, సాధ్యమైనంత వరకూ వాహనాన్ని నీడలో పార్క్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
అలర్ట్ : ఎండలు మండుతున్నాయ్ - మీ సీఎన్జీ కారును ఇలా కాపాడుకోండి!