NPS Pension : ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు ప్రతివ్యక్తీ కాలంతో పరుగులు తీస్తారు. చూస్తుండగానే రిటైర్మెంట్ సమయం వచ్చేస్తుంది. ఉన్నట్టుండి సంపాదన ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చేది పెన్షనే. కాబట్టి ముందు నుంచే పొదుపు చేయడం అనివార్యం. అయితే రిటైర్ అయిన తర్వాత మీకు నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ వస్తే ఎలా ఉంటుంది. అంత మొత్తంలో పెన్షన్ పొందాలంటే తప్పకుండా మీరు జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడులు పెట్టాలి. మరి ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా లక్ష రూపాయలను అందించే ఈ స్కీమ్‌లో ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి? ఎంతెంత పెట్టాలి? ఎవరు అర్హులు? ఏ వయసులో పెట్టుబడులు ప్రారంభించడం బెటర్? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగులే కానవసరం లేదు!
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. జాతీయ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సురక్షితం. ఎందుకంటే దీనికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఈ జాతీయ పెన్షన్ పథకం అనేది స్వచ్ఛంద, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. 18-70 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దేశంలోని సాధారణ పౌరులతోపాటు ప్రవాస భారతీయులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
పన్ను ప్రయోజనాలు!
ఈ ఎన్పీఎస్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే సెక్షన్ 80సీ ప్రకారం, రూ.1.5 లక్షల లిమిట్ దాటిన వాళ్లు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పొదుపు చేసి అదనంగా రూ.50 వేల పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1బీ) ప్రకారం కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయి. అయితే చాలా మంది రిటైర్మెంట్కు చాలా సమయం ఉందని యుక్త వయసులో పదవీ విరమణ ప్రణాళికను చేసుకోరు. ఆలస్యంగా పెట్టుబడులు ప్రారంభిస్తారు. దీని వల్ల మీకు వచ్చే ఆర్థిక లబ్ధి తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి.