తెలంగాణ

telangana

ETV Bharat / business

లేడీస్​ స్పెషల్​ - 'రివెంజ్ సేవింగ్స్' చేయండి - భవిష్యత్​లో కోటీశ్వరురాలు అవ్వండి! - Revenge Savings Trend - REVENGE SAVINGS TREND

Revenge Savings : 'రివెంజ్‌ సేవింగ్స్‌' - వినడానికి ఈ పదం చాలా కొత్తగా ఉంది కదూ. ఖర్చులను తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఈ ట్రెండ్ మొదలైంది. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ఈ ట్రెండ్‌, ప్రస్తుతం చైనాలో ఎక్కువగా వినిపిస్తోంది.

Revenge Savings
Revenge Savings (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 1:02 PM IST

Revenge Savings :చైనాలో ప్రస్తుతం 'రివెంజ్​ సేవింగ్స్​' ట్రెండ్ నడుస్తోంది. అనవసరపు ఖర్చులను బాగా తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఇది మొదలైంది. మరీ ముఖ్యంగా చైనా మహిళలు ఈ విధానాన్ని చాలా పకడ్బందీగా ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో కొనసాగుతున్న 'సేవింగ్‌ పార్టనర్‌' విధానాన్ని వారు అనుసరిస్తున్నారు.

ఒక కుటుంబం ఆర్థికంగా బాగుండాలంటే, అది మహిళల వల్లే సాధ్యం అవుతుంది. అందుకే మన దేశంలో ఇల్లాలిని ఇంటికి ఆర్థికమంత్రిగా చెబుతుంటారు. ఇదే సూత్రాన్ని చైనీయులు కూడా పాటిస్తారు. అందుకే అక్కడి మహిళలు తమ ఇంటిని గుల్ల చేసుకోకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు 'రివెంజ్ సేవింగ్స్' ట్రెండ్​ను అనుసరిస్తున్నారు.

లాక్​డౌన్​ తరువాత
లాక్‌డౌన్‌ పూర్తైన తర్వాత జీరో కొవిడ్‌ విధానాన్ని, అప్పటి వరకు విధించిన కఠిన ఆంక్షలను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది. దీనితో చైనీయులు విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేశారు. ఫలితంగా అనవసరపు ఖర్చులు పెరిగి, చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మరోవైపు దేశ ఆర్థికవ్యవస్థ కూడా బలహీనపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో మహిళలు 'రివెంజ్ సేవింగ్స్' ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు.

సరికొత్తగా
డబ్బులను పొదుపు చేసే విషయంలో చైనా మహిళలు సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. అందులో భాగంగా 'సేవింగ్‌ పార్టనర్‌' హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ సెట్ చేశారు. దీనికి లక్షలాది వ్యూస్‌ వచ్చాయని ఓ డేటా విశ్లేషణ సంస్థ తెలిపింది. ఆన్‌లైన్‌ గ్రూప్స్‌లో వేల మంది తమ పొదుపు పార్టనర్‌ను వెతకగా, వీరిలో 20-40 ఏళ్ల మధ్య ఉన్న మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్లు తేలింది.

చైనాలో పిల్లల చదువుల ఖర్చులు పెనుభారంగా మారాయి. దీనికి తోడు ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా లేదు. కనుక రానున్న రోజుల్లో ఉద్యోగం పోవడం, జీతాలు తగ్గడం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చని చైనీయులు భయపడుతున్నారు. అందుకే వీటిని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా రివెంజ్ సేవింగ్స్ చేస్తున్నట్లు చైనా మహిళలు ఓ సర్వేలో తెలిపారు.

ఇలా చేస్తే కోటీశ్వర్లు కావడం గ్యారెంటీ!
సేవింగ్‌ పార్టనర్‌ వెబ్‌సైట్స్‌లో చాలా పొదుపు సంఘాలుంటాయి. ఇందులో మహిళలు సభ్యులుగా చేరి తాము రోజూ ఎంత దాచుకున్నాం, ఎంత ఖర్చు చేశామన్నది రికార్డు చేసుకోవచ్చు. సభ్యుల్లో ఒకర్ని ఒకరు సంప్రదించుకుని ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సహచరుల సూచనలు పాటించి నెలవారీ ఖర్చుల్లో దాదాపు 40 శాతాన్ని ఆదా చేసుకోగలుగుతున్నామని కొందరు చైనా మహిళలు చెబుతున్నారు.

మరికొందరైతే ఆన్‌లైన్‌లో ఫుడ్​ ఆర్డర్లు పెట్టడం మానేసి, బుద్ధిగా వంట చేసుకుంటున్నారు. అనవసరపు వస్తువులు కొనడం మానేస్తున్నారు. ఇలా తమ దుబారా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తున్నారు. కొందరైతే ఆన్​లైన్ చెల్లింపులకు, ఫోన్‌లో చెల్లించే విధానానికి దూరంగా ఉంటూ, నగదునే వినియోగిస్తున్నారు. దీంతో తాము ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తోందని చెబుతున్నారు. అంతేకాదు, పొదుపునకు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, అందులో రోజూ ఎంతో కొంత నగదు వేస్తున్నారు. ఈ యాప్‌ను లక్షల మంది చైనా మహిళలు ప్రస్తుతం వాడుతున్నారు. గతంలో షాపింగ్‌కెళ్లి అవసరం లేని వస్తువులను భారీగా కొనే పద్ధతి కాకుండా, కేవలం అవసరమైన వాటిని మాత్రమే కాగితంపై రాసుకుని మరీ తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇదే సూత్రాన్ని భారతీయ మహిళలూ అనుసరించడం మంచిది. దీని వల్ల అనవసర ఖర్చులు తగ్గి, పొదుపు పెరిగి, భవిష్యత్​లో మీరు ఆర్థిక సుస్థిరత సాధించేందుకు వీలవుతుంది. అంతేకాదు మీ పొదుపు డబ్బులను సరైన మార్గంలో పెట్టుబడులు పెడితే, మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరే అవకాశం కూడా ఉంటుంది.

లేడీస్​ స్పెషల్​ - జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా? ఈ స్కీమ్స్​పై ఓ లుక్కేయండి! - National Womens Savings Day

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

ABOUT THE AUTHOR

...view details